ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. రాజధాని భూములపై ఏకంగా టాలీవుడ్ పెద్దలు ముందుకు కదిలారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వినీదత్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేశారు.
గన్నవరం ల్యాండ్ కు సంబంధించి నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని అశ్వినీదత్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలిపారు.
అయితే.. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా… భూసమీకరణ కింద భూమిని అశ్వినీదత్ ఇచ్చినట్టు వెల్లడించారు. దానికి బదులుగా సీఆర్డీఏ పరిధిలో అశ్వినీదత్ కు భూకేటాయింపులు చేశారు.
కానీ.. ఇప్పటి ప్రభుత్వం.. రాజధానిని వేరే చోటుకు తరలిస్తుండటంతో.. అక్కడ భూముల విలువలు పడిపోయాయని… ఇది అగ్రిమెంట్ ను ఉల్లంఘించడమేనని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. తాను ఎయిర్ పోర్టు కోసం ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వడమో లేదంటే భూసేకరణ కింద 4 రెట్ల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన పిటిషన్ లో తెలిపారు. తనకు నష్టపరిహారం కింద 210 కోట్లు ఇవ్వాలంటూ అశ్వినీదత్ డిమాండ్ చేస్తున్నారు.
కృష్ణంరాజు పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ
అదే గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు సంబంధించి కృష్ణంరాజు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కూడా ఎయిర్ పోర్టు విస్తరణ కోసం తన ల్యాండ్ ను ఇచ్చారు. తన భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.