కృష్ణమ్మ పరుగులు.. ఈ నీళ్ళు చెబుతున్న నిజాలేంటి.?

Krishna Water Running Towards Sea

Krishna Water Running Towards Sea

కృష్ణా నది నుంచి నీళ్ళు సముద్రంలోకి వడివడిగా వెళ్ళిపోతున్నాయి. నిజానికి, ప్రకాశం బ్యారేజీ వద్ద కనిపిస్తున్నది సుందర దృశ్యమే. కానీ, వేలాది మంది రైతులు ఈ నీళ్ళను చూసి కంటతడి పెట్టాల్సి వస్తోంది. అందుక్కారణం, ఈ నీళ్లు తెలంగాణలోని ఏదన్నా ప్రాంతానికో.. ఆంధ్రపదేశ్ ప్రకాశం బ్యారేజీ ఎగువన ఎదన్నా ప్రాంతానికో వెళ్ళి వుంటే.. అక్కడి రైతులు సంతోషించేవారు.

కానీ, ఆ అవకాశమే లేకుండా పోయింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా కిందికి విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా ఇదే పరిస్థితి. దానికన్నా దిగువన వున్న పులిచింతల ప్రాజెక్టు నుంచీ విద్యుత్ ఉత్పత్తి ద్వారానే నీటికి కిందికి విడుదల చేసేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కనిపించని వింత ఇది.

నిజానికి, అత్యంత దారుణమైన పరిస్థితి. ఎవరి మీద మంటతో తెలంగాణ ప్రభుత్వం ఇదంతా చేస్తోందోగానీ, వేలాది మంది రైతులు మాత్రం కంటతడి పెడుతున్నారు. రైతు కంటతడి పెడితే, అది సమాజానికి అస్సలు మంచిది కాదు. రానున్న రోజుల్లో ఎగువ నుంచి భారీగా వరద రావొచ్చుగాక కృష్ణా నదికి. రావాల్సిన స్థాయిలో రాకపోతే పరిస్థితి ఏంటి.? ‘మా భూ భాగం నుంచే కృష్ణా నది ఎక్కువగా ప్రవహిస్తుంది.. కాబట్టి, మా ఇష్టం..’ అంటున్నారు తెలంగాణ మంత్రులు కొందరు.

ఎగువన నీటిని ఒడిసిపట్టలేకపోతే, ఆ నీరు వృధాగా సముద్రంలోనికే వెళ్ళిపోతుంది. అలా సముద్రంలో కలిసిపోయే నీటి వల్ల ఎవరికి ప్రయోజనం.? రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారంతా ఒక్కటేనని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతుంటారు. మరి, ఇప్పుడు.. ఈ నీళ్ళ విషయంలో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నట్లు.? ఎగువనున్న మహారాష్ట్ర, కర్నాటక కూడా ఇలాగే వ్యవహరిస్తే.. తెలంగాణ పరిస్థితి ఏమవుతుంది.? తెలంగాణలో రాజకీయ లబ్ది కోసం తెలంగాణ రైతులకీ అన్యాయం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వ తీరుతో. వేల క్యూసెక్కుల నీటిని వృధా చెయ్యగలంగానీ, ఒక్క చుక్క నీటిని అయినా మనం సృష్టింగచలమా.?