అరరె, ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడమేంటి వరదల్లో.? నిజంగానే పెద్ద చోద్యమిది. పోనీ, అదేమన్నా పాత ప్రాజెక్టా.? అంటే, అదీ కాదాయె. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తయారు చేయించిన ప్రాజెక్టు గేట్లు, ఓ మోస్తరు వరదకే కొట్టుకుపోవడమంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే అది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ణం పేరుతో రూపొందించిన ప్రాజెక్టుల్లో పులి చింతల కూడా ఒకటి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్న సమయంలో నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశారు. శ్రీశైలం దిగువన, నాగార్జున సాగర్ తర్వాత.. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఈ పులిచింతల ప్రాజెక్టుని నిర్మించిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రి గేటు.. కొట్టకుపోయింది. ఆ గేటు జాడ కూడా కనిపించలేదు. దాంతో, ఇప్పుడు ప్రాజెక్టులో నీటి మొత్తాన్నీ ఖాళీ చేయించక తప్పని పరిస్థితి.
అదేంటో, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదీ కలిసి రావడంలేదు. ప్రధానంగా నీటి వృధా విషయంలో రాష్ట్రం పదే పదే అభాసుపాలవుతోంది. తెలంగాణ చర్యలతో ఇప్పటికే చాలా నీటిని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడీ గేటు కొట్టుకుపోవడంతో మరింత నష్టం జరిగింది రాష్ట్రానికి. సాధారణంగా వరదల కాలం వచ్చే సమయంలో ప్రాజెక్టులకు సంబంధించి ముందస్తుగానే అన్నీ సరి చూసుకోవాలి. పులిచింతల విషయంలో ఆ జాగ్రత్త కొరవడిందా.? ఏమోగానీ, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (ఏపీ), ప్రాజెక్టుని సందర్శించి, సకాలంలో గేటుని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని సెలవిచ్చారు. అదంత తేలికైన వ్యవహారం కాదు. ప్రాజెక్టులో నీళ్లన్నీ ఖాళీ చేస్తే తప్ప, కొత్తగా గేటు అమర్చడం వీలు కాదు. ఇంతకీ, ఇంత పెద్ద ఘటన ఎలా జరిగినట్లు.? అనుకోకుండా జరిగిన ఘటన అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం.. భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదం.. ప్రాజెక్టుల నుంచి వాటిల్లే అవకాశం ఖచ్చితంగా వుంటుంది.