గత ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేసి ఓడిపోయాక సైలెంట్ అయిన కొండా దంపతులు సురేఖ, మురళి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు సురేఖ కేసీఆర్, కెటీఆర్ లతో తీవ్రంగా విభేదించి పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. పంతం పట్టి మరీ తెరాసకు వ్యతిరేకంగా వెళ్ళి ఓడటంతో ఆమె నిరుత్సాహానికి గురయ్యారు. కానీ కొద్దిరోజులుగా ఆమె మళ్లీ రాజకీయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆమె జోరుగా కార్యకలాపాలు మొదలుపెట్టారట.
ఇలా ఉన్నట్టుండి కొండా దంపతులు కార్యరంగంలోకి దిగడానికి కారణం త్వరలో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో అధికారిక తెరాసను మట్టికరిపించి గత అసెంబ్లీ ఎన్నికల పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కొండా సురేఖ ఆలోచనని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అందుకే ఆమె తూర్పు నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు. వరంగల్ తూర్పులో కొండా దంపతులకు మంచి పలుకుబడి ఉంది. 2014లో ఈ స్థానం నుండి తెరాస తరపున బరిలోకి దిగిన సురేఖ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బసవరాజు సారయ్య మీద విజయం సాధించారు. కనుక ఆ ప్రాంతంలో ఆమెకు మంచి పట్టు ఉంది.
గత ఎన్నికల్లో ఇక్కడి నుండి తెరాస తరపున నరేందర్ నన్నపునేని గెలుపొందారు. కొండా సురేఖ మళ్లీ వచ్చి నియోజకవర్గంలో పాగా వేయడంతో నరేందర్ నన్నపునేనికి కంగారు మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే అయినా కొండా సురేఖ బలాబలాల గురించి తెలిసిన వ్యక్తి కావడంతో నిమ్మళంగా ఉండలేకపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పాగా వేసిన సురేఖ కాంగ్రెస్ శ్రేణులను కూడగట్టే పనిలో ఉన్నారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది కాబట్టి ఆమెకు క్యాడర్ ఈజీగానే పొగవుతున్నారు. వాటికి తోడు తెరాస కార్యకర్తలను సైతం సురేఖ కాంగ్రెస్ వైపుకు తిప్పుతున్నారు. ఇటీవలే 200 మంది తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ పరిణామాలన్నీ చూస్తున్న తెరాస ఎమ్మెల్యే కొండా దంపతులకు ఎలా అడ్డుకట్టవేయాలో తెలియక సతమతమవుతున్నారట. కేసీఆర్ అన్ని ఎన్నికలను ఒకేలా చూస్తారు. కార్పొరేషన్ ఎన్నికలే కదా అని లైట్ తీసుకునే రకం కాదు. లోకల్ ఎలక్షన్లలో గెలిస్తేంనే పైఎన్నికల మీద పట్టు ఉంటుందనుకునే రకం. అందుకే ఆయన వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలని సీరియస్ గా తీసుకున్నారు. కానీ కొండా దంపతుల ఎంట్రీతో ఎన్నికల స్వరూపం మరిపోయేలా ఉంది. కేసీఆర్ ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, కొండా దంపతుల చర్యలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారట.