పచ్చని కోనసీమ భగ్గుమనడానికి కారణమెవరు.? అన్నదానిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ సంగతి కాస్సేపు పక్కన పెడదాం. ఎందుకంటే, రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారు. మంట రాజేసి, అందులో చలికాచుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. కోనసీమ ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతమని చెబుతుంటారు. అందులో నిజం లేకపోలేదు.
రాజకీయంగా కోనసీమ చాలా చైతన్యం కలిగిన ప్రాంతం. విద్య, వ్యాపారం.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా, కోనసీమకు ప్రత్యేకమైన బ్రాండ్ వుంది. గౌరవ మర్యాదలే కాదు, వెటకారాలు కూడా అక్కడ ఎక్కువే. అలాంటి చోట, సహజంగానే సున్నితత్వం కూడా ఎక్కువే వుంటుంది.
అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్ళను ఆందోళనకారులు తగలబెట్టడం, అందులో మంత్రిగారి ఇల్లు కూడా వుండడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇంత రిస్క్ సామాన్యులైతే తీసుకునే ప్రసక్తే వుండదు. ఎందుకంటే, పరిణామాలు తీవ్రంగా వుంటాయ్.. ప్రజా ప్రతినిథుల ఇళ్ళ మీద దాడులు చేస్తే.. అన్న కామన్ సెన్స్ లేకుండా ఎవరూ ఈ పనికి దిగరు.
ఆ క్షణాన అలా జరిగిపోయింది.. అనడం చాలా తేలికే. కానీ, ఇక్కడ అంతా పథకం ప్రకారమే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా విపక్షాలు చేపట్టే చిన్నా చితకా ఆందోళనలకే, పోలీసులు హౌస్ అరెస్టుల వరకూ వెళుతుంటారు. మరి, కోనసీమలో ఎందుకు అలాంటి చర్యల్ని పోలీసులు తీసుకోలేకపోయారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కోనసీమ జిల్లాలో ‘పేరు మార్పు’ రగడ నేపథ్యంలో పోలీసులు ప్రజా ప్రతినిథుల ఇళ్ళకు ప్రత్యేకంగా భద్రత కల్పించి వుండాలి. కానీ, అలా ఎందుకు భద్రత కల్పించలేదన్నది ఇంకో ప్రశ్న. సమాధానం లేని ప్రశ్నలు చాలా వున్నాయ్. వాటికి సమాధానాలు వెతికితే.. ఈ ‘మంట’ రాజేసిందెవరో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.