కోనసీమ అల్లర్లు: మంత్రిగారి ‘పుత్ర రత్నం’ ఆడియో క్లిప్ వైరల్.!

Konaseema Fire

వైసీపీ నేత, మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి, కోనసీమ అల్లర్ల వ్యవహారంపై, వైసీపీకే చెందిన ఓ నేతతో పోన్‌లో మాట్లాడిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. సదరు వైసీపీ నేత అడపా సత్తిబాబు.. మంత్రి విశ్వరూప్‌కి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.

‘మా నాన్న పాలు పోసి మరీ నీలాంటి విషపు సర్పాన్ని పెంచి పోషించాడు..’ అంటూ కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో సదరు వైసీపీ నేత మీద విరుచుకుపడ్డాడు. అంతేనా, బూతులు తిట్టాడు. రెండు కాళ్ళూ తీసేస్తాననీ హెచ్చరించాడు. రాయడానికి వీల్లేనంత దారుణంగా మాట్లాడాడు ఫోన్‌లో విశ్వరూప్ తనయుడు. ఈ ఆడియో క్లిప్ ఎలా బయటకు వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.

‘నువ్వే ఈ మొత్తం దారుణానికి కారణం. నేను లేనప్పుడు నా ఇంటిని తగలబెడతావా.? నేను అమలాపురంలో వున్నాను.. ఇప్పుడు రా.. నీకు దమ్ముంటే..’ అంటూ విశ్వరూప్ తనయుడు సవాల్ విసిరిన వైనం ఈ ఆడియో క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

‘ఇంట్లో కుటుంబ సభ్యులకు తిండి పెట్టలేరుగానీ, మీకు జిల్లా పేరు కావాల్సి వచ్చిందా.? జిల్లా పేరు మార్చితే నాలుగు రూపాయల నష్టం, మార్చకపోతే నాలుగు రూపాయల లాభం వస్తుందా.?’ అని వెటకారంగా విశ్వరూప్ తనయుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ ఆడియో క్లిప్‌తో వ్యవహారం తేటతెల్లమైపోయింది.. వైసీపీకి చెందినవాళ్ళే ఈ మొత్తం అల్లర్ల కథ నడిపించారని.. అంటూ విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. మరి, వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై ఏమంటారో మరి.!