కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్: కాంగ్రెస్‌కి వేరే శతృవు అక్కర్లేదు

ఔను, కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులు అవసరం లేదు. ఆ పార్టీకి చెందిన నాయకులే, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సింది, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి. కాంగ్రెస్ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ. కానీ, ఆ సోయ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి వుండదు. అదంతే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. అయినా, మరీ ఇంత దారుణమా.? పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇంకా అసహనం చల్లారడంలేదు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, తనతో సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారనీ, తన నియోజకవర్గ పరిధిలో తనకు చెప్పకుండా పార్టీ పరంగా కార్యక్రమం నిర్వహించడమేంటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుస్సా అవుతున్నారు.

అంతేనా, ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పీసీసీ అధ్యక్షుడయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం నానా రకాల ప్రయత్నాలూ చేసి విఫలమయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదీ అసలు కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా వున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే దుస్థితి. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కీలక పదవులు దక్కినా.. పరిస్థితి ఇలానే తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత కల్లోలమే అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కలిసొస్తోంది. ఇంతకీ, కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి కారణమవుతున్న నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితికి మేలు చేయాలనే లక్ష్యంతోనే ఆ పని చేస్తున్నారా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.