తెలంగాణ : రంగారెడ్డి జిల్లా యాచారంలో ఫార్మాసిటీ వ్యతిరేక సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఫార్మా సిటీ శాపంగా మారిందని ఆరోపించారు. గతంలో చౌటుప్పల్ ఏరియాలో ఫార్మా సిటీ కంపెనీలు పెట్టడంతో ఇప్పటికే అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. రైతులకు రూ.12 లక్షలు ఇచ్చి కంపెనీలకు రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గ్రీన్ ఫార్మా సిటీపై కేసు వేయనున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. ఫార్మా సిటీతో నేల, గాలి, నీరు కలుషితం అవుతాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
మూడు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పుడు 20వేల ఎకరాలు లాక్కుంటున్నారు. ఫార్మా సిటీకి శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ ముందుండి పోరాటం చేస్తుంది. పోలీసులు ఎంత మంది వచ్చినా వెనక్కు తగ్గేది లేదు.. తుటాలు ముందు కోమటిరెడ్డి గుండె దాటి వెళ్లాలి.. మీ ముందు నేనుండి పోరాడతా. pic.twitter.com/p73tFOvyCf
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) October 11, 2020
తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాలపై టీఆర్ఎస్ నేతలు పడ్డారని ఆయన మండిపడ్డారు. ఫార్మాసిటీ అంటేనే ఒక కుంభకోణమని అధికార పార్టీ నేతలు డబ్బులు సంపాదించుకునేందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని వెంకటరెడ్డి అన్నారు. రూ.3 లక్షల కోట్లు స్వాహా చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్ తీసుకొచ్చారని ఆరోపించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫార్మా సిటీ పోరాటం రాష్ట్ర గతిని మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలాంటి శంకుస్థాపనలు చేయకుండా అడ్డుకోవాలని, భూములివ్వకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.