చంద్రబాబునే కొడాలి నాని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు.?

Kodali Nani

Kodali Nani

తెలుగునాట రాజకీయాల్లో తిట్ల పర్వం అనేది కొత్త విషయం కాదు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హద్దులు దాటి ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. ప్రత్యర్థులపై ‘కులాల వారీగా లెక్కలు కట్టి’ విమర్శలు చేయించడం అనేది చంద్రబాబు తీసుకొచ్చిన రాజకీయ మార్పు. ఫలానా కులానికి చెందిన నాయకుడ్ని తిట్టాలంటే, ఆ ఫలానా కులానికి చెందిన నాయకుడ్నే రంగంలోకి దించాలని గతంలో చంద్రబాబు రాజకీయ వ్యూహం రచించారు. అదే అమలవుతోంది చాలాకాలంగా.. అందునా, ఆంధ్రపదేశ్‌లో. నువ్వు నేర్పిన విద్యయే కదా.. అన్నట్టు చంద్రబాబు మీద మంత్రి కొడాలి నాని తిట్ల పర్వం గత కొన్నేళ్ళుగా హద్దూ అదుపూ లేకుండా పోతోంది. కొడాలి నాని విద్యార్హత సహా, ఆయన వ్యక్తిగత అంశాల గురించి టీడీపీ నేతలు తరచూ మాట్లాడుతుంటారు. అదే, ఆయనకు ఒళ్ళు మండేలా చేస్తుంది. టీడీపీలో వున్నప్పుడు చంద్రబాబు తనను రాజకీయంగా వేధించిన వైనాన్ని కోడాలి నాని ఎప్పటికీ మర్చిపోలేరు.

నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కొడాలి నానిని, ఆ కుటుంబానికి దూరం చేసింది ఇంకెవరో కాదు చంద్రబాబే. అలా చాలా వ్యవహారాలున్నాయి.. అందుకే కొడాలి నానికి, చంద్రబాబు పేరెత్తితే చిర్రెత్తిపోద్ది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తారు కొడాలి నాని, చంద్రబాబుని.. అవసరం వున్నా లేకపోయినా. తాజాగా ‘చంద్రబాబు కాదు.. స్టేల బాబు’ అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దేశంలో ఇంకే రాజకీయ నాయకుడూ ఇలా ఇన్ని స్టేలు తెచ్చుకుని కేసుల నుంచి తప్పించుకోలదని కొడాలి నాని మండిపడ్డారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకి శిక్ష తప్పదని కొడాలి నాని చెబుతున్నారు.

కొత్తగా శిక్ష పడేదేముంది.? చంద్రబాబుకి, 2019లో లేటెస్టుగా ప్రజా కోర్టులో శిక్ష పడింది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. ‘ముందుంది ముసళ్ళ పండగ..’ అని చంద్రబాబుని ఉద్దేశించి కొడాలి నాని చెబుతున్నారంటే, కథ పెద్దదే వుందన్నమాట.