‘గట్టిగా అరిస్తే ఎవరూ భయపడిపోరు.. బీజేపీ కార్యకర్తలైనా, కేంద్ర ప్రభుత్వమైనా.. తాటాకు చప్పుళ్ళకు అదిరిపోయి, బెదిరిపోయే పరిస్థితే లేదు..’ అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు.
‘ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషేనా అది.? దేశంలో దొడ్డు బియ్యానికి డిమాండ్ లేదు. అదెవరూ వాడటంలేదు. అందుకే, ఆ దొడ్డు బియ్యం వద్దని కేంద్రం చెబుతోంది.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీయార్ ఇంకోలా మార్చి చెబుతున్నారు..’ అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక దెబ్బకి తెలంగాణ రాష్ట్ర సమితి అయోమయంలో పడిపోయిందనీ, ముఖ్యమంత్రి కేసీయార్ డీలా పడ్డారనీ, ఈ నేపథ్యంలోనే కేసీయార్ నుంచి దిగజారుడు వ్యాఖ్యలు వస్తున్నాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పెట్రో ధరల విషయమై కేంద్రం వాహనదారుల్ని అర్థం చేసుకుందనీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రో ధరల్ని తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే. బీజేపీకీ, తెలంగాణ రాష్ట్ర సమితికీ మధ్య మాటల యుద్ధం చాలా జోరుగా నడుస్తోంది గత కొద్ది రోజులుగా.
‘మెడలు విరిచేస్తా.. ముక్కలుగా నరుకుతాం..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాటలు తూటాల్లా పేలుతోంటే, ‘కేసీయార్‌ని జైలుకు పంపుతాం..’ అంటూ బీజేపీ నుంచి హెచ్చరికలు షురూ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణకు అన్ని విధాలుగా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందన్నది కిషన్ రెడ్డి వాదన. మరి, కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీయార్ ప్రెస్ మీట్ పెట్టి తన వాదనను వినిపిస్తారా.? వేచి చూడాల్సిందే.