ఖేల్ రత్న పేరు మార్పు వెనుక రాజకీయం.!

ఖేల్ రత్న.. దేశంలో క్రీడా రంగ ప్రముఖులకు ఇచ్చే పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైనది. ఈ పురస్కారం పేరుని రాజీవ్ ఖేల్ రత్న కాకుండా, ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నగా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మంచి విషయమే ఇది. దాంతో, మోడీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ట్వీట్లు పోటెత్తుతున్నాయి. అయితే, అవార్డులకే కాదు, క్రీడా ప్రాంగణాలకు కూడా రాజకీయ నాయకుల పేర్లుండకూడదనే డిమాండ్ తెరపైకొచ్చింది. ‘పేరు మార్చారు మంచిదే.. ఖేల్ రత్నకు ఎలాగైతే పేరు మార్చారు.. నరేంద్ర మోడీ స్టేడియం అనే పేరు కూడా మార్చాలి..’ అంటూ డిమాండ్లు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభమైన స్టేడియంకి అంతకు ముందు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ స్టేడియం అని పేరుండేది.

దాన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చారు. అంటే, పాత స్టేడియం కూల్చేసి.. కొత్త స్టేడియం నిర్మించారు మరి. ఏ క్రీడాకారుడి పేరో పెట్టకుండా, నరేంద్ర మోడీ ఈ స్టేడియంకి తన పేరు పెట్టుకోవడమేంటి.? అన్న చర్చ అప్పట్లోనే జరిగింది. ఎప్పుడైతే రాజీవ్ ఖేల్ రత్న పేరు కాస్తా ధ్యాన్ ఛంద్ ఖేల్ రత్నగా మారిందో.. ఆ వెంటనే, నరేంద్ర మోడీ స్టేడియం పేరు అంశం కూడా వివాదాస్పదమయ్యింది. దేశంలో ఏదైనా రాజకీయ కోణంలోనే నడుస్తుంది. సొమ్ము ప్రజలది.. పేర్లు రాజకీయ నాయకులది. సంక్షేమ పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవడమనే నీఛ నికృష్టమైన రాజకీయం మన దేశంలోనే కనిపిస్తుంటుందన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మొత్తమ్మీదన, నరేంద్ర మోడీ.. ఓ అవార్డు పేరు మార్చి, తాను వివాదాల్లోకెక్కడం విచిత్రమే మరి.