ఖమ్మం.. టీడీపీకి అలా, షర్మిల పార్టీకి ఇలా.!

Khammam, TDP Out.. Sharmila Party In

Khammam, TDP Out.. Sharmila Party In

ఖమ్మం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లా. టీడీపీకి అతి ముఖ్యమైన నేతలు ఈ జిల్లా నుంచే వుండేవారు. 2019 ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా నుంచి టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు దక్కారు. ఆ ఇద్దరు మాత్రమే, 2019 ఎన్నికల్లో మొత్తం తెలంగాణ నుంచి టీడీపీ తరఫున గెలిచింది. కొద్ది రోజుల క్రితమే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ శాసనసభా పక్షాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంలో విలీనం చేసెయ్యాలని కోరుతూ తెలంగాణ స్పీకర్ కి లేఖ రాసిన విషయం విదితమే. అదే ఖమ్మం జిల్లా నుంచి షర్మిల పార్టీ తొలి అడుగు వేయడం.. అదీ, టీడీపీ మునిగిన కొద్ది రోజులకే షర్మిల పార్టీ ఖమ్మం గడ్డ మీద వికసించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.

నిజానికి, టీడీపీతో సంబంధం లేకుండానే వైసీపీకి ఖమ్మంలో మంచి పట్టుంది ఒకప్పుడు. వైసీపీకి ఓ ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు గతంలో ఖమ్మం నుంచే గెలిచారు. ఆ తర్వాత వాళ్ళంతా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారనుకోండి. అది వేరే సంగతి. ఇప్పుడిక తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటోన్న షర్మిలకు పొలిటికల్ వ్యాక్యూమ్ బాగానే కలిసొచ్చేలా వుంది. అయితే, షర్మిల తనకంటూ ఓ ఖచ్చితమైన ఓటు బ్యాంకు తెలంగాణలో వుందని భావిస్తున్నారు. ఆ ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల కారణంగా దెబ్బతినొచ్చు. సామాజిక వర్గ కోణంలో చూస్తే, బీజేపీ కూడా షర్మిల ధాటికి విలవిల్లాడేందుకు ఆస్కారముంది. అయితే, ఆంధ్రా పార్టీ అనే ముద్ర షర్మిల మీద పడితే, తట్టుకోవడం కష్టమే. ఆ దెబ్బకే వైసీపీ, తెలంగాణ నుంచి కనుమరుగైపోయిందన్న విషయాన్ని ఎలా విస్మరింగచలం.?