2019 ఎన్నికల సమయంలో జరిగిన ఎన్నో అనూహ్య ఘటనలలో వైఎస్ వివేకానందా రెడ్డి హత్య. ఆయన ఎలా చనిపోయారో అనే విషయం ఇప్పటి వరకు తెలియదు. ఈ విషయాన్ని కూడా అన్ని పార్టీల నాయకులు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు, చాలా వరకు సఫలం కూడా అయ్యారు. అయితే ఆయన మరణం వెనక ఉన్న కుట్రను తెలుసుకోవడానికి హైకోర్టు ఆదేశాల మేరకు, సిబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, రెండు నెలల క్రితమే సిబిఐ రంగంలో దిగింది. మొదటి విడతగా సిబిఐ 15 రోజులు పాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది. అప్పుడు జరిగిన విచారణలో అనుమానం ఉన్న చాలామందిని విచారణ చేశారు. తరువాత ఒక 40 రోజులు విచారణకు విరామం ఇచ్చిన అధికారులు ఇప్పుడు మరో దఫా విచారణ ప్రారంభించారు.
ఈసారి జరుగుతున్న విచారణలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ విచారణలో వైఎస్ వివేకానంద రెడ్డి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. పులివెందులలో చెప్పుల షాప్ యజమాని మున్నాకు ఈ సెటిల్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే మున్నాను, మున్నా కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు. అలాగే మున్నా బ్యాంక్ ఖాతాలో 48 లక్షల నగదును, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.
అలాగే వైసీపీ ఎంపీకి చెందిన సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారణ చేసిన సిబిఐ, మరింత విచారణ కోసం తన ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ని సీజ్ చేసి, లోతుగా విశ్లేషణ చెయ్యనున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తీ యురేనియం ఫాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో, రెండు రోజుల నుంచి కీలక పరిణామాలు ఎదురు అవుతున్నాయి. 2019ఎన్నికల్లో రాజకీయ అంశంగా మారిన ఈ హత్య వెనక ఎవరున్నారన్నది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.