కరోనా మమమ్మారి దెబ్బకు సినీ పరిశ్రమ కుదేలైంది. ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. థియేటర్లు తెరుచుకోకపోవడంతో చిన్న, పెద్ద సినిమాల నిర్మాతలందరూ నష్టాల్లో కూరుకుపోయారు. వడ్డీలకు ఫైనాన్స్ తెచ్చి సినిమాలు నిర్మించి అవి రిలీజ్ కాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఓటీటీ సంస్థలు సైతం అడునుచూసి తక్కువ ధరలకే సినిమాలను అడుగుతున్నాయి. పూర్తైన సినిమాలను ఉంచుకోలేక, ఓటీటీలకు తక్కువ ధరలకు అమ్ముకోలేక ఒత్తిడిలో పడిపోయారు నిర్మాతలు. ప్రభుత్వమే తమకు ఆదుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే కేరళ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.
తామే స్వయంగా ఓటీటీని మొదలుపెడుతున్నట్టు ప్రకటించింది. నిజంగా ఇది మలయాళ పరిశ్రమకు మంచి చేసే ఆలోచనే అనాలి. థియేటర్లు ఓపెన్ అయితే పెద్ద సినిమాలకు ఒక దారి దొరుకుతుంది. అయితే పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలే సినిమా హాళ్లు దొరక్క నలిగిపోతాయి. ఇలాంటి సినిమాలన్నింటికీ కేరళ ప్రభుత్వం తీసుకున్న బాగా ఉపకరిస్తుంది. ల్యాబ్లో మిగిలిపోయిన చిన్న సినిమాలకు ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక దారి దోటికినట్టే. నిర్మాణ వ్యయానికి తగ్గట్టే ప్రభుత్వమే డబ్బును చెల్లించి సినిమాలను కొనుగోలుచేస్తే నిర్మాతలు నష్టాల నుండి బయటపడటమే కాదు ఎంతో కొంత లాభాలు కూడ చూసే వీలుంది. అంతేకాదు ప్రభుత్వం సినీ ఇండస్ట్రీలోకి నేరుగా ప్రవేశించినట్టు ఉంటుంది కూడ.