‘మహానటి’ హిట్ తర్వాత కీర్తి సురేష్ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. ఒకేసారి ఆమె మూడు సినిమాలకు సైన్ చేసింది. ‘పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి’ సినిమాలు మొదలవడం, పూర్తికావడం జరిగిపోయింది. అయితే రిలీజ్ సమయానికి లాక్ డౌన్ పడింది.
దీంతో సినిమా హాళ్లలో విడుదలచేసే వీలు లేకుండా పోయింది. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఓటీటీల బాట పట్టారు. అప్పటికి కీర్తి సురేష్ కు ఉన్న ఫాలోయింగ్ కారణంగా ‘పెంగ్విన్’ చిత్రం మంచి ధరకే అమ్ముడైంది. కానీ ఆ చిత్రం ఓటీటీలో డిజాస్టర్ అయింది.
ఇక మరొక చిత్రం ‘మిస్ ఇండియా’ కూడ అంతే. సినిమా ఎప్పుడు విడుదలైందో కూడ జనాలకు తెలియదు. ఇవి కాకుండా ఈమధ్యనే థియేటర్లలో వచ్చిన ‘రంగ్ దే’ కూడ ఫ్లాప్ అయింది. దీంతో ఆమె సినిమాల మీద బయ్యర్లలో ఆసక్తి తగ్గింది.
ఈ ప్రభావం మొత్తం ‘గుడ్ లక్ సఖి’ మీద పడింది. సినిమాకు రావాల్సినంత పాపులారిటీ అయితే రాలేదు. ఇదిలా ఉండగానే ఈ చిత్రం జీ5 ఓటీటీ ద్వారా విడుదలవుతుందనే వార్తలు మొదలయ్యాయి. కానీ నిర్మాత సుధీర్ చంద్ర మాత్రం ఓటీటీ విడుదల వార్తలు వాస్తవం కాదని, ఏదైనా డిసైడ్ అయితే ముందుగానే చెబుతామని క్లారిటీ ఇచ్చారు.
దీన్నిబట్టి సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకుని అయినా ఉండాలి లేకపోతే కీర్తి సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఓటీటీల నుండి ఆశించినంత ఆఫర్ రాకపోవడమైనా జరిగుండాలి.