రచన- దర్శకత్వం : జేకే చంద్రు
తారాగణం : కీర్తి సురేష్, రాధికా శరత్‌కుమార్, సునీల్, రెడిన్ కింగ్స్లీ తదితరులు
సంగీతం : సీన్ రోల్డాన్,
ఛాయాగ్రహణం : దినేష్ బి. కృష్ణన్,
కూర్పు : ప్రవీణ్ కె.ఎల్.
నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనీ సామా
విడుదల : నవంబర్ 28, 2025
Revolver Rita Movie Review: విజయ్ నటించిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’, శిలాంబరాసన్ నటించిన ‘మానాడు’ మూవీస్ కి రచన చేసిన దర్శకుడు జె.కె. చంద్రు, ‘నవీన సరస్వతి శబదం’ కి దర్శకత్వం వహించిన దశాబ్ద కాలానికి ‘రివాల్వర్ రీటా’ క్రైం కామెడీతో తిరిగి వచ్చాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్. కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖీ’’ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు మూడూ ఫ్లాపయ్యాయి. మరి నాల్గో ప్రయత్నంగా ఈ ‘రివాల్వర్ రీటా’ అయినా హిట్టయ్యిందా?
కథేమిటి?
పాండిచ్చేరిలో చికెన్ ఫాస్ట్ ఫుడ్ జాయింట్‌లో పనిచేసే రీటా (కీర్తి సురేష్) ది, తల్లి చెల్లెమ్మ (రాధికా శరత్‌కుమార్), ఇద్దరు చెల్లెళ్ళు (గాయత్రీ షాన్, అక్షతా అజిత్) లతో చాలా సింపుల్ గా, ఆనందకర మధ్యతరగతి జీవితం. అమాయకురాలైన రీటాకి చిన్న చెల్లెలు డాక్టర్ కావాలంటే నీట్ పాసయ్యేలా చూసుకునే బాధ్యతతో బాటు,తాగుబోతుని పెళ్ళిచేసుకున్న పెద్ద చెల్లెలికి, ఆమె కొడుక్కీ మెరుగైన జీవితాన్ని అందించే బాధ్యత.

ఇలా వుండగా, ఒక రోజు రీటా ప్రపంచం తలకిందులైపోతుంది. ఆమె ఇంట్లో మేనకోడలు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా భయంకరుడైన పాండిచ్చేరి గ్యాంగ్‌స్టర్ డ్రాక్యులా పాండియన్ గన్ పట్టుకుని ఇంట్లోకి దూసుకొస్తాడు. షాక్ కి గురైన రీటా, ఆమె తల్లీ అతడ్ని ఎదుర్కొనే క్రమంలో ఠకీల్మని చస్తాడు. ఇంత ఉత్తుత్తినే చచ్చిన ఈ భయంకరుడ్నిఏం చెయ్యాలన్న గందరగోళంలో ఆడవాళ్ళు నల్గురూ ఏం చెయ్యాలో అదే చేసి చేతులు దులుపుకుందామనుకుంటే, వాడి కొడుకు డ్రాక్యులా బాబీ (సునీల్) వెంటపడతాడు. మరోవైపు తన అన్నని చంపినందుకు ప్రతీకారంగా భయంకరుడ్ని చంపాలని చూస్తున్న ఆంధ్రా డాన్ రెడ్డి (అజయ్ ఘోష్) ఛేజింగ్. ఇంత సీరియస్ అయిపోయిన పరిస్థితిని రీటా రివాల్వర్ పట్టి ఎలా ఎదుర్కొన్నదనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారు?
రీటా టైటిల్ రోల్ లో కీర్తీ సురేష్ గెటప్ బావుంది. అయితే పాత్ర విషయంలో, దాంతో నటన విషయంలో మిగిలేది నిరాశే. గతంలో ఆమె తండ్రి ఆత్మహత్య ఆమెలో భావోద్వేగాన్ని సృష్టిస్తుంది. అయితే ఆ కథ కూడా అంతగా ఆకట్టుకోదు. దాంతో ఆ భావోద్వేగం కూడా ఆమెని ముందుకు నడిపించదు. ప్రస్తుత కథలో డేడ్ బాడీ తో కామెడీ అయితే చాలా పూర్ గా వుంటుంది. కామెడీ- యాక్షన్ ఈ రెండు విషయాల్లో ఆమె పాత్ర గురించి, నటన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఆమె సోదరీమణుల పాత్రలు కూడా పెద్దగా పని లేని పాత్రలుగా ఉండి పోయాయి. తల్లి పాత్రలో రాధికా శరత్ కుమార్ మాత్రమే అయోమయపు పాత్రగా బాగా నవ్విస్తుంది. క్లయిమాక్స్ లో ఆమె నటనే కిక్ ఇస్తుంది. ఇక సునీల్ పోషించిన డ్రాక్యులా బాబీ విలన్ పాత్రలో సునీల్ చేసే విలనీ ఏమీ వుండదు. ఈ పాత్ర కూడా పూర్ గా క్రియేట్ చేశాడు దర్శకుడు. సునీల్ తాను కనిపించే ప్రతి సన్నివేశానికీ ‘మాస్’ ఆకర్షణను తెచ్చిపెట్టినప్పటికీ, డ్రాక్యులా బాబీగా తన నటనలో పేలవంగా ఉండడానికి పాత్రలో బలం లేకపోవడం కారణం. అతడి తమ్ముడుగా రెడిన్ కింగ్స్లీ పోషించిన చీతా అనే కామెడీ పాత్రది నాటు కామెడీ. అజయ్ ఘోష్ ఆంధ్రా డాన్ పాత్ర డైలాగులు తప్ప పెద్దగా విషయం కనిపించదు.

సంగీత దర్శకుడు సీన్ రోల్డాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడి బిజీఎం BGM అనేక సన్నివేశాలని ఎలివేట్ చేయడానికి సహాయపడింది. పాటలు మామూలుగా వున్నాయి. సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ విజువల్ యాంగిల్స్, లైటింగ్ సినిమా నాణ్యతని పెంచాయి. ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్. బహుముఖ కథనాన్ని గందరగోళానికి గురిచేయకుండా ప్రజంట్ చేయడానికి ప్రయత్నించాడు.
ఇంతకీ కథ ఎలావుంది?
రీటా చేతిలో రివాల్వర్లో పేలడానికి ఆరు తూటాలైతే వున్నాయి- వాటినెప్పుడు ఎక్కడ ఎలా పేల్చి ఈ క్రైం కామెడీతో నవ్వించవచ్చో పది శాతం కూడా తెలియక, పూత్ర్తిగా చేతులెత్తేసి, కీర్తీ సురేష్ కి ఇంకో అపకీర్తిని మిగిల్చాడు పేరున్నరచయితైన దర్శకుడు! డ్రాక్యులా మృతదేహాన్ని వదిలించుకుని తన కుటుంబాన్ని కాపాడుకోవడం రీటా లక్ష్యంగా సాగే కథ, కథనంలో విసుగు పుట్టించేలా తయారయ్యింది.భయంకర పరిస్థితిలో చిక్కుకున్న అమాయక మహిళల కుటుంబం నేరస్థులతో, డాన్లతో, పోలీసులతో ప్రమాదంలో పడి ఎలా బయటపడ్డారన్న కథని కామెడీ తో- యాక్షన్ తో కలిపి చెప్పాలనుకున్న దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. చాలా లాజిక్ లేని సన్నివేశాలు చైల్దిష్ గా వున్నాయి.
ఫస్టాఫ్ పాత్రల పరిచయం, రీటా కుటుంబ నేపథ్యం, ఇంటికి మగ దిక్కు లేకపోవడం వలన వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని చిత్రిస్తుంది. ఈ నేపధ్యంలో బర్త్ డే పార్టీలోకి డ్రాక్యులా దూసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ్నుంచే సినిమా గందరగోళంగా మారుతుంది. సెకండాఫ్ అంతా ఈ గందరగోళం మితిమీరి ఇక చాలు అని ప్రేక్షకులు అరిచేదాకా వెళ్తుంది. ఇంతే ఈ సినిమా. కీర్తీ సురేష్ ఏం చూసి ఈ సినిమా ఒప్పుకుందో గానీ ప్రేక్షకులకి నరకం చూపించింది.
రేటింగ్ : 2 / 5

