ఆంధ్రప్రదేశ్ కథ ముగిసింది.. తెలంగాణ వెలిగిపోతోంది.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫుల్ జోష్ మీదున్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరుగుతుండడం.. రియల్ ఎస్టేట్ రంగం పరుగులు తీస్తుండడం.. ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతుండడంతో.. ఆదాయం పరంగా తెలంగాణ ఓ వెలుగు వెలుగుతోంది. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి.. రాష్ట్రానికి శాపంగా మారింది. కొన్నేళ్ళ క్రితం తెలంగాణలో భూముల విలువ తగ్గి, ఆంధ్రప్రదేశ్‌లో పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెట్టారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

చంద్రబాబు హయాంలో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరమంటూ ప్రమోట్ చేసి, గాల్లో మేడలు కట్టేశారు. అది రియాల్టీలో నిజం కాకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టుబడిదారుల్లో ఆసక్తి సన్నగిల్లింది. వారికి వెంటనే దొరికిన బెటర్ ఆప్షన్ తెలంగాణ అయ్యింది. రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆశలు వదిలేసుకుని.. తెలంగాణ వైపు ఫోకస్ పెట్టాయి. ఐటీ రంగం సంగతి సరే సరి. ఎప్పుడూ హైద్రాబాద్ నగరానికి.. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం పోటీ కాలేదనుకోండి.. అది వేరే సంగతి. విశాఖపట్నం అభివృద్ధిపై సందిగ్ధత.. ఐటీ రంగానికి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేస్తోందన్నది నిర్వివాదాంశం. ఎలా చూసుకున్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయింది. అదే సమయంలో, తెలంగాణ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తోన్న వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రకంపనలకు కారణమవుతున్నాయి. అదే సమయంలో, పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రంలో భరోసా లభిస్తోందన్నది నిపుణుల అభిప్రాయం. ఎలా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగేదెలా.? బలమైన ప్రభుత్వం అక్కడున్నా.. పెట్టుబడిదారుల్ని ఎందుకు ఆకర్షించలేకపోతోంది.? డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు జగన్ సర్కార్ దిగకపోతే.. పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది.