ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించే చర్చ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దుబ్బాక పోరు ముగియగానే.. జీహెచ్ఎంసీ పోరు ప్రారంభం కావడంతో తెలంగాణ మొత్తం.. రాజకీయాలన్నీ మళ్లీ వేడెక్కాయి. రాజకీయ పార్టీలు మళ్లీ ఎన్నికల కోసం సమయాత్తమవుతున్నాయి.
అయితే.. దుబ్బాక పోరులో బీజేపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో రాజకీయాలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ కు బీభత్సమైన షాక్ తగలడంతో వెంటనే దిద్దుబాటు చర్యలను టీఆర్ఎస్ ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం పోటీ అంటే టీఆర్ఎస్, బీజేపీ మధ్యే. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మూడో స్థానమే. అయితే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తున్నామని జనసేన ఇంతకుముందు ప్రకటించింది. కానీ.. ఏపీలో బీజేపీతో జనసేనకు ఉన్న పొత్తు కారణంగా.. తెలంగాణలో కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కేవలం బీజేపీ మద్దతు పలుకుతూ.. పోటీ నుంచి విరమించుకున్నారు జనసేన అభ్యర్థులు.
అయితే.. పోటీలో లేకున్నా కూడా పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారట. బీజేపీ తరుపున ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఆయన తెలంగాణలో 2014లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.
అప్పటి నుంచి మళ్లీ తెలంగాణలో ఏ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు. ఏపీకే పవన్ పరిమితమయ్యారు. ఈ మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పవన్ కు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. దీంతో వార్.. కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య జరగనుంది. దీనిపై టీఆర్ఎస్ నాయకులు కూడా పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు.. కేసీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారిపోయాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరేళ్ల తర్వాత బీజేపీ కోసం తెలంగాణలో ప్రచారం చేయబోతున్న పవన్ కళ్యాణ్.. టీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేస్తారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.