ముచ్చటగా మూడోస్సారి.! తెలంగాణలో అధికారం కేసీయార్‌దే మళ్లీ.!

ఇంకో కొత్త సర్వే వెలుగు చూసింది. గులాబీ పార్టీకి సుమారుగా 80 సీట్లు తెలంగాణలో వచ్చే అవకాశం వుందట. ‘ఆరా’ అనే సంస్థ జరిపిన సర్వే ఇది. ఆరా మస్తాన్ గతంలో తెలుగు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా, అందులో ఏపీలో వైసీపీకి అధికారం వస్తుందని పేర్కొన్నారు. అదే జరిగింది కూడా. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీదే గెలుపని ఆరా సంస్థ చెప్పింది.. అదే అక్కడా జరిగింది.

అయితే, ఆరా సంస్థ వెల్లడించిన సర్వేలో బీజేపీకి ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగింది. ఓటు బ్యాంకు పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అయితే, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయట. అలాగని ఆరా సంస్థ సర్వే చెబుతోంది.

ఇదిలా వుంటే, ఆరా మస్తాన్ నిజానికి బీజేపీ మనిషి. బీజేపీ పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో, ఈ సర్వే విశ్వసనీయతపై టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓటు బ్యాంకు పరంగా చూసుకుంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తేడా చాలా తక్కువ. ఇదెలా సాధ్యం.? అన్నది గులాబీ నేతల వాదన.

ఎవరి వాదనలు ఎలా వున్నా, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ పార్టీదే అధికారమనే విషయం తేటతెల్లమవుతోంది. అయితే, అప్పటికి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో ఇప్పుడే అంచనాకి రావడం కష్టం.

పైగా, జరుగుతున్న సర్వేలన్నీ ఆయా పార్టీలకు అనుబంధంగానే వుంటున్న దరిమిలా, సర్వేల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతూ వస్తోంది.