బ్లాక్ ఫంగస్: కేసీయార్ సారూ.. అదసలు వుందా.? లేదా.?

KCR Silly Comments On Black Fungus

KCR Silly Comments On Black Fungus

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ గురించి చాలా భయాలు చూశాం. చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇంకా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కేంద్రం, అవసరమైన మందుల్ని రాష్ట్రాలకు పంపిస్తోంది. ఆ కోటా సరిపోవడంలేదని దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా వుంది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వమూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. జిల్లాల పర్యటనల్లో భాగంగా బ్లాక్ ఫంగస్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మీడియాకి పనీ పాటా లేకుండా బ్లాక్ ఫంగస్ అంటోందంటూ మండిపడ్డారు. బ్లాక్ ఫంగస్ లేదు.. వైట్ ఫంగస్ లేదు.. అంటూ తేలిక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. మరోపక్క, కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదనీ, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందనీ, తాను కూడా అవే గోళీలు వేసుకున్నాననీ కేసీఆర్ వ్యాఖ్యానించారు.అయితే, ఆలస్యం చెయ్యకుండా కరోనా వచ్చిందని తెలియగానే డాక్టరుని సంప్రదించాలన్నది కేసీయార్ సూచన.

కాగా, కేసీయార్ తీరుని తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. పారాసిటమాల్ వేసుకుంటేనే కేసీఆర్ కరోనా నుంచి బయటపడ్డారన్నది నిజమైతే, ఆయనెందుకు యశోదా ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేత శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీయార్ వ్యాఖ్యలతో కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగే ప్రమాదముందన్నారు. అదీ నిజమే. మరీ ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ విషయమై ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన ముఖ్యమంత్రి లైట్ తీసుకుంటే ఎలా.?