తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చాలా మారింది. ఆయనలోని మార్పుకు సొంత పార్టీ నేతలే ఆశ్చర్యానికి గురవుతున్నారు. నెల ముందు వరకు బీజేపీ అన్నా, మోదీ నాయకత్వమన్నా బుసలుకొట్టిన కేసీఆర్ ఇప్పుడు చల్లారిపోయారు. గతంలో బీజేపీ ప్రస్తావన వస్తే ధారాళంగా మాటలు వదిలేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. అది కూడ బీజేపీ నిర్ణయాలకు సానుకూలంగా కావడం విశేషం. దుబ్బాక ఎన్నికలకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మధ్యలో హైదరాబాద్ నుంచే బీజేపీపై యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మొదటి నుండి కేంద్రం ప్రతిపాదించిన అనేక బిల్లులను దుయ్యబడుతూ వచ్చారు. వ్యవసాయ బిల్లును చెత్త బిల్లు అన్నట్టు మాట్లాడారు.
ఒకానొక దశలో ఏకంగా థ్రర్డ్ ఫ్రంట్ పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ రాష్ట్రంలో బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకోవడం, వరుస ఓటములు కేసీఆర్ వైఖరిని మార్చి వేశాయి. ఉన్నపళంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన మోదీ, అమిత్ షాలతో పాటు బీజేపీ పెద్దలు పలువురుని కలిశారు. అక్కడ ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ రాష్ట్రానికి తిరిగి రాగానే యూటర్న్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. వ్యవసాయ బిల్లును పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు మాత్రం ఆ బిల్లు మంచిదన్నట్టు మాట్లాడుతున్నారు. సాగు చట్టాల అమలుకు రాష్ట్రం సానుకూలంగా ఉన్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. నియంత్రిత సాగు పద్దతిని ఉపసంహరించుకున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రజలను కూడ విస్మయానికి గురిచేశాయి.
గతంలో కేంద్రం పెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే తమ ఆరోగ్య శ్రీ ఉత్తమమైన పథకమన్న ఆయన ఇప్పుడు మాత్రం దాన్ని కూడ అమలుచేస్తామని, దాని వలన ప్రజలకు మంచి జరుగుతుందని అంటున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను తిరిగి పాత పద్ధతిలో కొనసాగించడానికి, ఎల్ఆర్ఎస్ పద్ధతిని వెనక్కి తీసుకోవడానికి అంగీకారం తెలిపారు. ఇక తాజాగా బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న రహస్యంగా కలిశారట ఆయన. శివరాజ్ సింగ్ వ్యక్తిగత పని మీద మంగళవారం హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్ ఆయన్ను బుధవారం ఒక హోటల్లో కలిశారని ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు. తెరాస మాత్రం ఈ విషయమై గట్టిగా మాట్లాడలేకున్నారు.
ఇక ఈ సమావేశంలో శివరాజ్ సింగ్, కేసీఆర్ ప్రస్తుత రాజకీయాల గురించి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక పరిస్థితుల గురించి, భావిష్యత్తులో కేంద్ర నాయకత్వం తీరు ఎలా ఉండబోతోందనే విషయాల మీద మాట్లాడుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలే బీజేపీకి కేసీఆర్ లొంగిపోయారనే అభిప్రాయాలు వెలువడుతున్న తరుణంలో కేసీఆర్ ఇలా బీజేపీ ముఖ్యమంత్రిని కలవడం, సమావేశం గురించి పెద్దగా సమాచారం బయటకు రాకవపోవడం పలు ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది.