ఎన్నికలెప్పుడొచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత వ్యూహాత్మకంగా ‘సెంటిమెంటు’ని రాజేస్తుంటారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఏపీతో తెలంగాణకి నీళ్ళ పంచాయితీ అంశం తెరపైకి వచ్చిందా.? అన్న చర్చ తెలంగాణ జనంలోనూ జరుగుతున్నది అందుకే. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా నది నుంచి నీళ్ళు దోచుకుపోవడానికి ప్లాన్ చేస్తోందంటూ కేసీఆర్ అండ్ టీమ్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. తానే స్వయంగా ఉద్యమిస్తానని కేసీఆర్ చెప్పారంటే, నిజానికి ఇది చాలా సీరియస్ అంశం అయి వుండాలి. కానీ, ఇలా కేసీఆర్.. ఏపీతో పంచాయితీ.. అంటూ కథలు చెప్పడం కొత్తేమీ కాదు. పోలవరం ప్రాజెక్టు విషయమై పలుమార్లు ఇలాంటి పంచాయితీలకు తెరలేపారు.
వాటితో పోల్చితే, ఇవేం అంత ప్రత్యేకమైనవి కాకపోవచ్చు. హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ బీజేపీతోపాటు, కాంగ్రెస్ సహా అన్ని విపక్షాల్నీ నిర్వీర్యం చెయ్యాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ముందున్న ఆప్షన్ తెలంగాణ సెంటిమెంటుని రాజేయడమే. ఏపీ – తెలంగాణ మధ్య నీటి పంచాయితీ అనగానే.. రాష్ట్రాల వారీగా నాయకులు విడిపోతారు.. జాతీయ పార్టీలకు ఇది చాలా పెద్ద తలనొప్పి. అది చాలా తేలిగ్గా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్లస్ పాయింట్ అయిపోతుంది. కేసీఆర్ ఆలోచన కూడా అదే. లేకపోతే, గడచిన ఏడేళ్ళుగా ఏపీ – తెలంగాణ మధ్య నీళ్ళ పంచాయితీలు ఎందుకు కొనసాగుతాయి.? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హైదరాబాద్‌కి పిలిపించుకుని, నీళ్ళ పంపకాలపై చర్చలు జరిపిన కేసీఆర్, ఇప్పుడు లొల్లి పెట్టడమేంటి.? అన్నటికీ మించి, తెలంగాణ నుంచి ఈ స్థాయిలో రచ్చ జరుగుతున్నా ఏపీ మౌనం దాల్చుతోంది. బహుశా ఈ వ్యవహారంపై ఏపీలోని అధికార పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ముందస్తు సమాచారం వుందేమో.