కరోనా వైరస్ నుంచి కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ వదిలి, ప్రగతి భవన్ చేరుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో కరోనా బారిన పడ్డ కేసీఆర్, ఆ తర్వాత ఇప్పటిదాకా ‘ఫామ్ హౌస్’కే పరిమితమైపోయారు. అక్కడే వైద్య చికిత్స పొందారు. మధ్యలో ఓ సారి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ హైద్రాబాద్ వచ్చినా, తిరిగి ఫామ్ హౌస్ కే వెళ్ళిపోయిన విషయం విదితమే. ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ కీలక వ్యవహారాలు చక్కబెట్టేశారు. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ నుంచి మంత్రి పదవిని లాగేశారు.
ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపే దిశగా స్కెచ్ కూడా రెడీ చేశారు. సరే, ఈటెల వ్యవహారంలో నిజమేంటి.? అన్నది వేరే చర్చ. ఇక, ఇప్పుడు హైద్రాబాద్ మళ్ళీ పూర్తిస్థాయిలో పరిపాలన విషయమై బిజీ అవబోతున్నారన్నమాట. కరోనా పాండమిక్ నేపథ్యంలో కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ గురించిన ఊహాగానాలు వినిపిస్తున్నా, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే వుంది. అయితే, పొరుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా వున్న దరిమిలా, సరిహద్దుల్ని మూసేయడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై నిఘా పెట్టడం అనేది అత్యంత కీలకమైన అంశం. లేదంటే, మెట్రో నగరం హైద్రాబాద్.. కరోనా దెబ్బకు విలవిల్లాడే ప్రమాదముంది. బెంగళూరులో ఇప్పటికే పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపు తప్పేసింది. అలాంటి దుస్థితి హైదరాబాద్ నగరానికి రాకూడదంటే, కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మరోపక్క, కరోనా టెస్టుల సంఖ్య గతంతో పోల్చితే బాగా తగ్గిన దరిమిలా, తిరిగి లక్షా పాతిక వేలు ఆ పైన టెస్టులు చేసే దిశగా అధికార యంత్రాంగానికి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాల్సి వుంది.