తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలో గ్రేటర్ మున్సిపాలిటీల ఎన్నికలతో పాటు.. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దుబ్బాకలో ఉపఎన్నిక కూడా జరగనుంది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో నిలిపే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే చాలామంది నాయకుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న నేతలకు ఈసారి చాన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం మాత్రం కేసీఆర్ మేధోమథనం చేస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ మాత్రం ఈసారి ఉద్యమకారులకే ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఉద్యమకారులై ఉండి.. ఇప్పటి వరకు ఎటువంటి పదవిని చేపట్టని వాళ్లకు ఈసారి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫమ్ అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈనేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వాళ్లలో దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ నాగేశ్వర్, మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దేశపతి శ్రీనివాస్.. ఉద్యమ సమయంలో కదంతొక్కి తన గానంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సంగతి తెలిసిందే.
అయితే.. ఇప్పటికే ఎమ్మెల్సీ టికెట్ తనకే అని మేయర్ బొంతు రామ్మోహన్ ఫిక్స్ అయ్యారట. కానీ.. ఈసారి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం లేదని తెలిసి నిరాశకు గురయినట్టు తెలుస్తోంది.
మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మర్రి రాజశేఖర్ రెడ్డికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన మంత్రి మల్లారెడ్డి అల్లుడే. ఆయనకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి పట్టు ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి మర్రికి టికెట్ ఇస్తారన్న వార్తలు వస్తున్నాయి.
మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ.. లేదా గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే.. ఆయనకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నదట.