బీజేపీ కుంభస్థలాన్ని కొట్టిన కేసీయార్.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గత కొంతకాలంగా దేశంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు కేసీయార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మొత్తంగా సుమారు 750 మంది వరకు రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందనుందన్నమాట. కేంద్రం నుంచి పాతిక లక్షల ఆర్థిక సాయం ఒక్కో రైతు కుటుంబానికీ ప్రకటించాలంటూ కేసీయార్ డిమాండ్ చేసేశారు కూడా.

కొత్త సాగు చట్టాల వ్యవహారానికి సంబంధించి ముందస్తు సమాచారం అందిందో ఏమో, కేసీయార్.. అత్యంత వ్యూహాత్మకంగం రంగంలోకి దిగి, రైతులకు మద్దుతగా.. అంటూ ఉద్యమించిన విషయం విదితమే. వరి విషయంలోనే కేసీయార్ ఉద్యమించినా, ఆయన టైమింగ్ ఆదుర్స్ అంతే.

కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోడీ రైతులకు క్షమాపణ కూడా చెప్పారు. దాంతో, కేసీయార్ బంపర్ విక్టరీ కొట్టినట్లయ్యింది. దానికి కొనసాగింపుగా, ఇప్పుడీ రైతులకు ఆర్థిక సహాయం ప్రకటన కూడా వుంది.

ఢిల్లీ వేదికగా కేంద్రంలోని మోడీ సర్కారుకి వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్న కేసీయార్, ఈ క్రమంలో బోల్డంత బలాన్ని పుంజుకున్నారు. జాతీయ స్థాయిలో వివిధ వర్గాల నుంచి కేసీయార్ ప్రభుత్వానికి కేంద్రంపై పోరాటంలో మద్దతు లభించేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఈ సమయంలో కేసీయార్‌ని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై తెలంగాణ బీజేపీ, అటు బీజేపీ కేంద్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోందట.