20 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే కేసీయార్ సర్కారు పడిపోతుందా.?

20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే తెలంగాణలో కేసీయార్ సర్కారు పడిపోతుందా.? ఈ విషయమై కేసీయార్ చేసిన తాజా వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేనీ వంద కోట్లకు కొనుగోలు చేయాలని బీజేపీ బ్రోకర్లు ప్రయత్నించినట్లుగా కేసీయార్ ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాదు, ఇటీవల ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఎపిసోడ్ అదే చెబుతోంది కూడా.

లీక్ అయిన ఆడియో టేపుల ప్రకారం, తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను బీజేపీ వైపుకు తీసుకొస్తానన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఏకంగా 100 కోట్ల ఆఫర్ ఇచ్చారు ఓ స్వామీజీ. ఫరీదాబాద్ నుంచి వచ్చాడాయన. అయితే, రోహిత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ మొత్తం తతంగాన్ని బయటపెట్టారనుకోండి.. అది వేరే సంగతి.

ప్రస్తుతం కేసు విచారణ దశలో వుంది. డబ్బులేమీ దొరికినట్లు పోలీసులు ఇప్పటివరకు పేర్కొనలేదు.. కోర్టుకీ విన్నవించలేదు. సో, ఈ కేసు నిలబడటం అనేది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చే నాయకుడైన ఎమ్మెల్యేకి వంద కోట్లు ఇస్తే సరిపోతుందనీ.. మిగతా ముగ్గురికీ నామమాత్రంగా ఇస్తే సరిపోతుందని బ్రోకర్లు మాట్లాడుకోవడం ఆడియో టేపులో బయటపడింది.

సో, ఎమ్మెల్యేలను లాగేయడం బీజేపీకి పెద్ద పనేమీ కాదన్నమాట. కేసీయార్ చెబుతున్నట్లు ఒక్కో ఎమ్మెల్యేకీ వంద కోట్లు ఇచ్చేంతలా ఏ పార్టీ తింగరి పని చేయదు. ఎందుకంటే, ఏడాది తిరగకుండానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ వుంది.

కానీ, తెలంగాణలో కేసీయార్ సర్కారు పడిపోయే అవకాశం వుందంటే మాత్రం, బీజేపీ కాకపోయినా.. కాంగ్రెస్ అయినా రిస్క్ తీసుకోవచ్చు. ఇరవై మందిని లాగేస్తే ప్రభుత్వం కూలిపోతుందని అనుకుంటున్నారంటూ బీజేపీని విమర్శించబోయి కేసీయార్ సెల్ఫ్ గోల్ వేసేసుకున్నట్లయ్యింది.