కేసీయార్ ఢిల్లీ టూర్: సంధి కోసమా.? తేల్చుకునేందుకా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్ళారు. కేంద్రంతో ‘వరి’ విషయమై అమీ తుమీ తేల్చుకునేందుకే ఈ ఢిల్లీ యాత్ర.. అంటూ కేసీయార్ గతంలోనే ప్రకటించారు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత కేసీయార్ స్వయంగా హైద్రాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అసలు కేసీయార్, కేంద్రంతో ఎందుకు యుద్ధం చేస్తన్నారు.? అన్నదానిపైనే భిన్న వాదనలున్నాయి. కేంద్రం, తెలంగాణలో వరి పంటను కొనుగోలు చేసే విషయమై పలు రకాల ఇబ్బందుల్ని సృష్టిస్తోన్నమాట వాస్తవం. దానికి రకరకాల కారణాల్ని చూపుతోంది కేంద్రం. కానీ, కేంద్రం తీరుని కేసీయార్ తప్పు పడుతున్నారు.

కేంద్ర మంత్రుల్ని కలుస్తామనీ, అవసరమైతే ప్రధానితోనూ ఈ అంశంపై భేటీ అవుతామనీ కేసీయార్ చెబుతోన్న విషయం విదితమే. అయితే, కేసీయార్ ఏం చేసినా.. కేంద్రం తాను చెయ్యాలనుకున్నది మాత్రమే చేస్తుందని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. మరెందుకు కేసీయార్ ఢిల్లీకి వెళ్ళడం.?

ఇదిలా వుంటే, కొత్త వ్యవసాయ చట్టాల విషయమై కేంద్రం దిగి రావడం, అంతకు ముందే ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ కేసీయార్ నినదించడం, ఆ రైతు ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని కేసీయార్ ప్రకటించడం.. వెరసి.. పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

కేసీయార్ ప్రకటను రైతు సంఘాలు స్వాగతించాయి. కేసీయార్ డిమాండ్ చేసినట్టు, కేంద్రం బాధిత రైతు కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సాయం చేయాల్సిందేనన్నది రైతు సంఘాల వాదన. పక్కా ప్లానింగ్‌తో కేసీయార్ ఢిల్లీ టూర్‌ని డిజైన్ చేశారు. కానీ, ఎక్కడో తేడా కొడుతోంది. కేంద్రంతో కేసీయార్ ‘రాజీ ఫార్ములా’ ఖరారు చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజమేని.?