ఖర్చు దండగ వ్యవహారం.! ఔను, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి, అక్కడి జాతీయ నాయకులతోనూ, కలిసొచ్చే పార్టీల అధినేతలతోనూ చర్చలు జరుపుతుండడంపై సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ ఇది.
ఇంతకీ, కేసీయార్ పర్యటనలకి ఖర్చు తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి జరుగుతోందా.? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి వెచ్చిస్తున్నారా.? ఏమో, ఈ విషయమై స్పష్టత లేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో, కేసీయార్.. ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అన్నట్లుగా పలువురు జాతీయ స్థాయి నాయకులతో గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా కేసీయార్, బీహార్ వెళ్ళారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల విషయమై బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించేశారట. అంతే కాదు, కేసీయార్ జాతీయ భావాలు కలిగిన నాయకుడనీ, కోవిడ్ కష్ట కాలంలో.. పొరుగు రాష్ట్రాలకు చెందినవారికీ సాయం చేశారనీ, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నారనీ, గల్వాన్ ఘటనకు సంబంధించి సైన్యానికీ అండగా నిలిచారనీ.. బీహార్ సీఎం చెప్పుకొచ్చారు.
ఇంతకీ, కేసీయార్ చేయబోయే జాతీయ రాజకీయానికి బీహార్ సీఎం నుంచి మద్దతు వుంటుందా.? వుండదా.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుంటుంటారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆయనే బీహార్ ముఖ్యమంత్రి. ఈ మధ్యనే బీజేపీని వదిలించుకుని, కాంగ్రెస్ పంచలన చేరారాయన. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కూడా కాదు, కాంగ్రెస్ వున్న కూటమితో పొత్తు పెట్టుకున్నారు.
నితీష్ కుమార్ సంగతి పక్కన పెడదాం.. అసలు కేసీయార్, బీహార్ టూర్ వల్ల ప్రయోజనమేంటి.? ఇది కూడా ఖర్చు దండగ వ్యవహారమేనా.? అంతే అయి వుండొచ్చు.