తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు నేడు. యన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పుట్టిన రోజున ఉదయం 10-00 గంటల నుంచి 11-00 గంటల వరకు కేవలం ఒక గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు.
ఇక నేడు పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, వీల్ చైర్ల పంపిణీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటనున్నారు. గంటలో కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యంతో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నేడు కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరోపక్క, ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం తరువాత క్యాంపు కార్యాలయానికి వచ్చి నేతలు, అభిమానులను కలుస్తారని తెలుస్తోంది.
కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభినందనలు తెలిపిన హరీశ్ రావు, ఆయన కారణ జన్ముడని, ఆయన కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించి, ఇక్కడి ప్రజల తలరాత మారిందని అన్నారు. ఇక హోమ్ మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ, తెలంగాణకు దేవుడిచ్చిన బహుతిగా కేసీఆర్ ను అభివర్ణించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఆయన వెలుగులను నింపుతున్నారని కొనియాడారు.