కేసీయార్ మారిన మనిషి.. ఇదిగో సాక్ష్యం.!

కేంద్ర ప్రభుత్వాన్ని ఏకి పారేయడం షురూ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీయార్). ఇది ఇకపై డైలీ సీరియల్ అవుతుందా.? అంటే, అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, కేంద్రం తీరుని ఎండగడుతూ వందలాది మంది వేలాది మంది రైతులతో నిరసన ప్రదర్శనలు చేస్తామని కేసీయార్ ప్రకటించేశారు.

‘రైతులు పండించే వరి కొనబోమని కేంద్రం చెబుతుందా.? ఇదెక్కడి వింత.?’ అంటూ కేసీయార్ మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలకు చేతనైతే, ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని కేసీయార్ పిలుపునిచ్చారు. ‘మీకు చేతనవుతుందా.? తెలంగాణ సమాజం తరఫున నిలబడగలరా.? మాతో కలిసి రైతులకు మద్దతుగా నిలబడి చూపించండి..’ అంటూ కేసీయార్ సవాల్ విసిరేశారు.

‘అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భూభాగంలోకి చైనా చొరబడుతోంది. మన దేశంలోకి చొరబడుతున్న చైనా పట్ల అప్రమత్తంగా వుండాలి. ఈ విషయమై మేం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తే, దేశ ద్రోహులంటున్నారు. ఇదెక్కడి చోద్యం.?’ అని కేసీయార్ ప్రశ్నించారు.

పెట్రో ధరల్ని కేంద్రం చాలా చాలా తగ్గించాల్సి వుందనీ, పూర్తిగా ఎక్సైజ్ పన్నుని ఉపసంహరించుకోవాలని కేసీయార్ డిమాండ్ చేశారు. ‘కేంద్రం గనుక పన్నులు తగ్గించుకుంటే, పెట్రోల్ ధర 70 నుంచి 77 రూపాయలకే లభిస్తుంది.. డీజిల్ 70 రూపాయల లోపే వుంటుంది..’ అని చెప్పుకొచ్చారు కేసీయార్.

‘బరాబర్ తగ్గేది లేదు. మేం వ్యవసాయం చేస్తున్నాం.. అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం.. మాకు వ్యాపారాల్లేవ్.. మాకు తెలంగాణ సమాజం పట్ల బాధ్యత వుంది. నేను చాలామందిని ఎంపీల్ని చేశాను, ఎమ్మెల్యలను చేశాను.. నన్ను సవాల్ చేస్తావా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద గుస్సా అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.