కత్తి మహేశ్ మృతి చిత్రపరిశ్రమను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. మెరుగైన చికిత్స అందుతోంది.. కోలుకుని తిరిగొస్తాడనుకున్న తరుణంలో ఆయన మరణవార్త ఆయన అభిమానులకు, ముఖ్యంగా కుటుంబసభ్యులకు తీరనిలోటు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. నటుడిగా, సినీ విశ్లేషకుడిగా, రచయిత, దర్శకుడిగా భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. చిత్తూరు జిల్లా పీలేరులో పుట్టి పెరిగారు. తండ్రి వ్యవసాయ శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయనకు ఒక అన్న, చెల్లి. మహేశ్ భార్య బెంగాలీ. ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
మైసూర్ రీజనల్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్స్ చేశారు. మహేశ్ కు చిన్ననాటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. వేసవి సెలవుల్లో రోజుకో సినిమా చూసేవారు. సినిమా బాలేదని టాక్ వస్తే.. ఎందుకు బాలేదో చూద్దామని సినిమా చూసేవారు. ‘రాఘవేంద్ర మహత్యం’ సీరియల్ కు 10 ఎపిసోడ్స్ కు పని చేసాక డబ్బులు సరిపోక చిత్తూరు వెళ్లిపోయి యూనిసెఫ్, సేవ్ ది చిల్డ్రన్, వరల్డ్ బ్యాంక్.. వంటి ఎన్జీవో సంస్థల్లో చేరారు.
అనురాగ్ కశ్యప్ మాటలకు ఉత్తేజితుడై.. మళ్లీ పరిశ్రమకు వచ్చి ప్రయత్నాలు చేశారు. అనేక ప్రయత్నాల అనంతరం బాలగంగాధర తిలక్ ‘ఊరి చివర ఇల్లు’ స్క్రిప్ట్ రాసుకుని షార్ట్ ఫిలిం తీశారు. నటుడిగా ప్రేక్షకులకు తెలిసినా ఆయన నటుడవ్వాలనే కోరికతో పరిశ్రమకు రాలేదు. దర్శకుడు కావాలని వచ్చి.. నటుడయ్యారు. కానీ.. టీవీ, యూట్యూబ్ చానెల్స్ లో సినీ విశ్లేషకుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే.. ఆయనకు బాగా గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ హోస్ట్ గా జరిగిన మొదటి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. నాలుగు వారాలపాటు షోలో కొనసాగారు.
నిర్మాత సాయి రాజేశ్ స్నేహితుడు కావడంతో హృదయకాలేయం సినిమాలో నటించారు. మంచి పేరు రావడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. కొబ్బరిమట్ట సినిమాలో ఆయనపై గ్రామ బహిష్కరణ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో నిజంగానే నగర బహిష్కరణలో ఉన్నారు. స్వీయ దర్శకత్వంలో మంచి సందేశాత్మక చిత్రం తీయాలనే కత్తి మహేశ్ కల నెరవేరకుండానే మృతి చెందడం విచారకరం. ఆయన అంత్యక్రియలు నేడు చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరుగనున్నాయి.