2019 ఎన్నికల తర్వాత ఆంధ్రాలో సరికొత్త రాజకీయం పుట్టుకొచ్చింది. అదే ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి మద్దతుపలకడం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాను చంద్రబాబు నాయుడు తరహాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయనని, అక్రమ వలసలను ప్రోత్సహించనని అన్నారు. తన పార్టీలోకి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా రావాలి అనుకుంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. దీంతో వైసీపీలోకి వెళ్లాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు వేరే రూట్ ఎంచుకున్నారు. వీరు అధికారికంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలుగానే ఉంటారు కానీ బయట మాత్రం వైసీపీ నేతలుగానే వ్యవహరిస్తుంటారు. అన్ని రకాలుగా వైఎస్ జగన్ కు మద్దతు ప్రకటిస్తుంటారు. టీడీపీని డ్యామేజ్ చేస్తుంటారు.
అలాంటి ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు ఉన్నారు. వీరిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సినారియో చాలా ప్రత్యేకం. వైఎస్ జగన్ పదవి వదిలి పార్టీలోకి రావాలని కండిషన్ పెట్టాక బాగా ఆలోచించిన కరణం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీలోకి పంపారు. ఆయన మాత్రం అనధికారికంగా వైసీపీ నేతగా కొనసాగుతున్నారు. ఇక కరణం వెంకటేష్ అయితే స్థానికంగా వైసీపీలో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అధికారుల బదిలీ నుండి నియోజకవర్గంలో ముఖ్యమైన పనుల వరకు అన్నింటిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారట. దీంతో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర అసహానినికి లోనవుతున్నారు.
గత ఎన్నికల్లో కరణం బలరాం గెలుపొందింది ఆమంచి మీదనే. ఇరువురూ ఉప్పు నిప్పులా ఉండేవారు. ఎన్నికల యుద్దంలో హోరాహోరీ తలపడ్డారు. అలాంటిది బలరాం ఇప్పుడు ఇన్నాల్లూ తాను మోసిన పార్టీలోకి వచ్చి తన ప్రాముఖ్యతను తగ్గించేలా రాజకీయం చేస్తుండటం, కుమారుడిని పార్టీలో పెట్టి చక్రం తిప్పుతుండటం ఆయనకు నచ్చలేదు. దీంతో రెండు వర్గాల మధ్య పోరు తీవ్రమైంది. ఆమంచి కూడ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో ఆయన కూడ తగ్గట్లేదు. తాజాగా ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి వర్థంతి కావడంతో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు చీరాలలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల నడుమ ఉద్రిక్తత నెలకొంది. ఈ సంధర్భంగా కరణం కుమారుడు గతంలో మాదిరి బెదిరింపులు, అరాచకాలు జరిగితే ఊరుకునేది లేదు. చీరాల అభివృద్ది కోసమే వైసీపీలోకి వచ్చాం. ఎవరికీ భయపడేది లేదు. మంత్రి బాలినేని అడుగుజాడల్లో పనిచేస్తాం అన్నారు. దీంతో అంతర్గత కలహాలు ఏ స్థాయిలో ఉన్నాయో బహిర్గతమైంది.