కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పోనంత వరకు రాజకీయాల్లో చురుగ్గానే ఉండేవారు. నిత్యం ఏదో ఒక ఇష్యూ మీద స్పందిస్తూ ఛానెళ్ళలో కనిపించేవారు. కానీ ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుండి ఆయన్ను దించేశారో అప్పటి నుండి ఆయన మరీ నల్లపూస అయిపోయారు. అధ్యక్ష పదవి పోయినందుకు తనకేమీ బాధ లేదంటూనే బోలెడు బాధను బయటపెడుతున్నారు. పదవిని తొలగింపబడినప్పుడు కన్నా తన బాధను బాగానే కవర్ చేశారు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామన్నట్టు, పదవి లేదనే బాధ తనకు లేదన్నట్టు కలరింగ్ ఇచ్చారు. కానీ లోపల చాలా ఫీలయ్యారట.
వాతావరణం కన్నాను పదవి నుండి ఉన్నపళంగా తీసేస్తున్నట్టు కనిపించినా కన్నాకు అధిష్టానం నుండి లీకులు ముందే అందాయట. విశ్వసనీయ సమాచారం అండదంతో కన్నా అమిత్ షాను కలిసే ప్రయత్నం చేశారట. కానీ షా అపాయింట్మెంట్ దొరకలేదు. అమిత్ షా, కన్నాకు మంచి సంప్రదింపులే ఉండేవి. అన్నీ బాగున్నప్పుడు షాను కలవడానికి కన్నా పెద్ద కష్టపడాల్సి వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే పదవి నుండి తొలగించాలి అనుకున్నారో అప్పుడే పక్కనపెట్టడం మొదలుపెట్టారు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉండటానికి ప్రధాన కారణం అమిత్ షాయే.
కన్నా వైసీపీలోకి వెళ్లాలా, బీజేపీలో చేరాలా అనే మీమాంసలో ఉన్నప్పుడే అమిత్ షా ఆయనకు టచ్లోకి వెళ్ళి బీజేపీలోకి లాగారట. అప్పుడు కేంద్ర స్థాయి పదవికి హామీ కూడా వచ్చిందని టాక్. దాంతో వైసీపీకి చేయి చూపించి కషాయ కండువా వేసుకున్నారట. అదే వైసీపీలోకి వెళ్లి ఉంటే ఆయన స్థాయి ప్రజెంట్ ఉన్న పరిస్థితి కంటే మెరుగ్గా ఉండేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే కన్నా కూడ ఆలోచిస్తూ బాధపడుతున్నారట. చారిత్రక తప్పిదం చేశామే అంటూ ఫీలవుతున్నారట. పైపెచ్చు ఆయన కేంద్ర స్థాయి పదవి ఆశ కూడ నెరవేరేలా లేదనేది ఆయనకున్న మరొక పెద్ద బాధట.