నటీనటులు కరోనాకు గురికావడం ఆగట్లేదు. తరచూ ఎవరో ఒకరు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మొన్న శిల్పాశెట్టి ఫ్యామిలీ మొత్తం కరోనాకు గురయ్యారు. అంతకుముందు దీపికా పదుకొనెకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా స్టార్ నటి కంగనా రనౌత్ సైతం కరోనాకు గురైంది. కంగనా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారానికి ఎంపిక కావడమే కాకుండా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టడంతో ఆమె పేరు జాతీయ స్థాయిలో చర్చల్లో ఉంటోంది. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్న ఆమె రాజకీయాల వైపు వెళ్లాలనే ఉదేశ్యంలో ఉందేమో అనే అనుమానం కలుగుతోంది జనానికి.
ఇవన్నీ కాకుండా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘తలైవి’ టీజర్ మంచి హిట్టైంది. దివంగత జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇలా కొన్ని నెలల్లోనే పాపులర్ అయిన ఆమె కరోనా బారిన పడ్డారు. కొన్నిరోజులుగా లక్షణాలు కనబడుతున్నాయని, నా శరీరంలో కరోనా వైరస్ పార్టీ చేసుకుంటోందని సమస్యను సరదాగా బయటపెట్టిన కంగనా భయపడకుండా కరోనాతో పోరాడుదాం. అదొక ఫ్లూ అంతే. మనం భయపడితే అది భయపెడుతుంది. కాబట్టి ధైర్యంగా ఎదుర్కొని కరోనాను నాశనం చేద్దామని పిలుపునిచ్చారు.