కమల్ కి దూరమైనా టార్చ్‌లైట్‌ .. ఇప్పుడు ఏంచేస్తారో ?

మక్కల్‌ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ చిహ్నం దూరమైంది. ఆ చిహ్నాని ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చికి దక్కింది. తమ చిహ్నం దూరం కావడంతో కమల్‌ హాసన్‌కు నిరాశ తప్పలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌కు ప్రెషర్‌ కుక్కర్‌ చిక్కడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందుగా కమలహాసన్‌ మక్కల్‌ నీదిమయ్యం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ ఎన్నికల్లో కొంత మేరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు నినాదంతో ప్రచార ప్రయాణాన్ని సైతం మదురై నుంచి మొదలెట్టారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు కేటాయించిన టార్చ్‌లైట్‌ ను పార్టీ చిహ్నంగా మార్చేసుకుని ప్రచార పయనంలో దూసుకెళ్తున్న కమల్‌కు నిరాశ తప్పలేదు. ఎన్నికల కమిషన్‌ ఆ టార్చ్‌లైట్‌ చిహ్నంను కమల్‌కు దూరం చేసింది. ఈ చిహ్నంను ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చికి తాజాగా అప్పగించడంతో కమల్‌ వర్గానికి షాక్‌ తప్పలేదు.

పుదుచ్చేరిలో మాత్రం మక్కల్‌ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ను చిహ్నంగా కేటాయించడం కాస్త ఊరట. అన్నాడీఎంకేను చీల్చి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న శశికళ ప్రతినిధి దినకరన్‌ పంతం నెగ్గించుకున్నారు. టార్చ్‌లైట్‌ దూరం విషయంగా తేనిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌ను ప్రశ్నించగా, టార్చ్‌లైట్‌ దూరమైనా లైట్‌హౌస్‌ వలే ప్రజలకు వెలుగు నిస్తామని ధీమా వ్యక్తం చేశారు.