కూటమిలో కొత్త టెన్షన్… మరో సీటు అక్కడ అడుగుతున్న బీజేపీ!

టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీని కోరి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరం అనేది ఈ కూటమి ఏర్పాటుకు చంద్రబాబు చెప్పిన లాజిక్. కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో.. కేంద్రంలోని బీజేపీతో పొత్తు ఉండే పాలన సాగుతుందా.. అభివృద్ధి జరుగుతుందా అనేది బాబుకే తెలియాలి! పోనీ.. 2014లో బీజేపీతో పొత్తు ఉండి ముగ్గురూ కలిసి ఏపీని ఉద్దరించింది ఏముంది? దొంగ నువ్వు అంటే నువ్వు అనుకోవడం తప్ప!

సరే వారి కూటమి సంగతి.. అందుకు అవసరమైన అధికారిక, అనధికారిక కారణాల సంగతి కాసేపు పక్కనపెడితే… బీజేపీ కాస్త స్ట్రాంగ్ గానే యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుందని అంటున్నారు! బీజేపీలో కూడా తాను చెప్పినవారికే టిక్కెట్లు దక్కించుకున్నాను అనే ఆనందం చంద్రబాబుకి ఉందని చాలా మంది భావిస్తుంటారు. మరిది మాటకు అంగీకరించడం వల్ల స్వామికార్యం స్వకార్యం కూడా పూర్తయ్యిందని పురందేశ్వరి ఫీలవుతున్నారని కూడా చెబుతుంటారు.

ఏది ఏమైనా కూటమిలో భాగంగా త్యాగశీలి పుణ్యమాని బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే! ఇందులో ఇప్పటికే 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది! ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు లాంటి వారికి కూడా కోరిన టిక్కెట్ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఉందని తెలుస్తుంది.

మోడీ ఎంత గొప్ప నేత అయినా, అమిత్ షా ఎంత గొప్ప పొలిటీషియన్ అయినా… ఎంత పవర్ ఫుల్ స్థానాల్లో ఉన్నా… చంద్రబాబు ముందు మాత్రం వాళ్ల కుప్పిగంతులు చెల్లవని నిరూపణ అయ్యిందనే కామెంట్లు ఇప్పటికే ఏపీలో వినిపిస్తున్న పరిస్థితి. జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు లాంటి హార్డ్ కోర్ బీజేపీ నేతలకు టిక్కెట్లు దక్కకపోవడం అనేది ఖచ్చితంగా చంద్రబాబు విజయం అని అయినా భావించాలి.. బీజేపీ చేతకానితనం అని అయినా అంగీకరించాలనేది బలమైన వాదనగా ఉంది!

ఈ నేపథ్యంలో మరో సీటు కావాలని బీజేపీ నేతలు చంద్రబాబుని ఆడుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా… 10 కాదు 11 అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతున్నారని సమాచారం. కడప జిల్లాలో మరో సీటును బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కుదిరితే రాజంపేట, కుదరకపోతే ఉమ్మడి చిత్తురు జిల్లాలోని తంబళపల్లె అని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కుదరదరు అని చంద్రబాబు తెగేసి చెప్పినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి స్థానంలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కూడా బలంగా పట్టుబట్టినట్లు చెబుతున్నారు. ఈ సీటును సోము వీర్రాజుకు ఇప్పించి తమ పరువు నిలుపుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు! మరి బీజేపీ పెద్దలు కోరుతున్నట్లు ఆ 11 సీటు దక్కుతుందా.. లేక, చంద్రబాబు చెప్పినట్లు, ఆయన ఇచ్చిన చొట్ల తీసుకుని సైలంటుగా ఉంటారా అనేది వేచి చూడాలి!