యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రవచనాలొచ్చేశాయ్.!

రాజకీయాలెలా తగలడ్డాయో అందరం చూస్తూనే వున్నాం. కొత్తగా తెలుసుకున్నట్టున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. మామూలుగా అయితే, సినీ నటుడు కదా.. రాజకీయాలతో పాపం సంబంధం లేని వ్యక్తి.. అనుకోవచ్చు. కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు గనుక.. రాజకీయాల పట్ల ఆయనకీ బాధ్యత వుండాలి.. రాజకీయాల్ని ఆయన ఫాలో అవుతూనే వుండి వుండాలి.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ శాసనసభ్యులు దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వైనంపై జూనియర్ ఎన్టీయార్ గుస్సా అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. రాజకీయాలు ఎలా వుండకూడదో చెప్పాడు. తనదైన స్టయిల్లో ప్రవచనాలు చెప్పాడు.

బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తిగా కాదు.. తండ్రిగా, కొడుకుగా, భర్తగా.. ఓ భారతీయ పౌరుడిగా, తెలుగువాడిగా మాట్లాడుతున్నానని యంగ్ టైగర్ అన్నాడు. మంచిదే. రాజకీయాల్లో మంచి మార్పు కోసం ఆలోచించడాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే.

కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అత్యంత హేయంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు, ఈ తండ్రి.. ఈ కొడుకు.. ఈ భర్త.. ఈ పౌరుడు ఏమైపోయాడు.? అన్నదే అసలు ప్రశ్న.

ఓ దుర్మార్గుడి దాష్టీకం కంటే, ఓ మేధావి లేదా ఓ మంచి వాడు.. లేదా ఓ సామాన్యుడి మౌనం.. అత్యంత ప్రమాదకరమంటారు కొందరు ప్రజాస్వామ్యవాదులు. తన కుటుంబ సభ్యుల మీద ఎప్పుడైతే వ్యక్తిగత విమర్శలొచ్చాయో.. ఆ వెంటనే, మంచి రాజకీయాల గురించి నీతులు చెప్పడాన్ని ఏ నైజం అనాలో ఏమో.