ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకి కొత్త అధినేత వచ్చే శుభ ఘడియలు దగ్గరపడుతున్న సమయంలో …. అమెరికా అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణం చేయనున్నారు. 1971లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన , అధ్యక్షుడు కావాలన్న ఐదు దశాబ్దాల తన కలను నేడు సాకారం చేసుకోనున్నారు.
బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు .. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరుగనున్న బైడెన్ ప్రమాణానికి రాజధాని వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. రెండువారాల క్రితం అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులు పునరావృతంకాకుండా పాతిక వేల మంది నేషనల్ గార్డు బలగాలు డేగ కండ్లతో నిఘాను మరింత పటిష్ఠం చేశాయి.
క్యాపిటల్ హిల్ భవనం వైపునకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం మహోత్సవానికి సంబంధించి రిహార్సల్స్‌లో భాగంగా క్యాపిటల్ భవనాన్ని అధికారులు సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాణం జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటనలు జరిగితే యంత్రాంగం ఎలా స్పందించాలన్న అంశంపై ఈ రిహార్సల్స్ నిర్వహించారు. ఇక , కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధ్యక్షుడి ప్రమాణానికి వెయ్యి మంది అతిథులనే అనుమతించబోతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బుధవారం బాధ్యతలు చేపట్టబోతున్న భారత సంతతి మహిళ కమలాహ్యారిస్ కాలిఫోర్నియా సెనేట్ పదవికి సోమవారం రాజీనామా చేశారు.
కొత్తగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తికి పాత అధ్యక్షుడు స్వాగతం చెబుతూ ప్రమాణ కార్యక్రమానికి హాజరవ్వడం ఆనవాయితీ. అయితే బైడెన్‌కు తాను స్వాగతం చెప్పే ప్రసక్తేలేదని అధ్యక్షుడు ట్రంప్ గతంలో తెలిపారు. ఈ విధంగా 150 ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ఆయన తూట్లు పొడిచారు.