జియో ఏది చేసినా సంచలనమే. నాలుగేళ్ల ముందు ఇంటర్నెట్ వాడాలంటే ఇంటర్నెట్ సెంటర్ లో గంటకు 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఇఛ్చి కావాల్సిన పని చేసుకొని వచ్చేవాళ్లం. స్మార్ట్ ఫోన్లు ఉన్నవాళ్లు అయితే రెండొందలో మూడొందలో పెట్టి ఒక జీబీ డేటా వేయించుకొని దాన్నే దాచుకొని దాచుకొని నెల పాటూ వాడుకునేవారు.
కానీ.. ఎప్పుడైతే జియో మార్కెట్ లోకి వచ్చిందో.. సంచలనం లేపింది. పుణ్యానికే డేటా, కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక చూసుకోండి.. వినియోగదారులు ఊరుకుంటారా? రెచ్చిపోయారు. అప్పుడే డేటా ఛీప్ అయిపోయింది. ఆ తర్వాత రోజుకు జీబీల కొద్దీ డేటాను ఖర్చు చేసేలా తయారయ్యాం. అదంతా జియో పుణ్యమే.
ఆ తర్వాత జియో తీసుకొచ్చిన మరో సంచలనం జియో ఫైబర్. బ్రాడ్ బాండ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్ కూడా సూపర్ సక్సెస్. ఇప్పుడు మరింత తక్కువ ధరలో బ్రాడ్ బాండ్ సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఇదివరకు ఉన్న ప్లాన్లతో పాటు సరికొత్తగా 399 రూపాయల ప్లాన్ ను జియో ప్రవేశపెట్టింది.
సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది. 399 రూపాయల ప్లాన్ అత్యంత చౌకైన ప్లాన్. నెలకు 399 రూపాయలు కడితే చాలు.. 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ రానుంది.
ఇక.. కొత్త వినియోగదారులకు కూడా జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త వినియోగదారులు నెల రోజు పాటు ఫ్రీగా నెట్ ను పొందొచ్చు. ఫ్రీ ట్రయల్ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ప్రకారం.. నెల రోజుల పాటు 150 ఎంబీపీఎస్ స్పీడ్ తో నెట్ లభిస్తుంది. అలాగే 10 ఓటీటీ యాప్స్ కూడా ఉచితంగా అందిస్తున్నారు.
ఒకవేళ ఆగస్టు 15 నుంచి 31 మధ్య జియో ఫైబర్ కనెక్షన్ తీసుకున్నవాళ్లు అయినా సరే.. ఫ్రీ ట్రయల్ కు అర్హులు అవుతారని జియో ప్రకటించింది. ట్రయల్ పూర్తయ్యాక కనెక్షన్ వద్దనుకుంటే కూడా ఎటువంటి ప్రశ్నలు వేయకుండా.. కనెక్షన్ ను కట్ చేస్తామని జియో ప్రకటించింది.
ప్రస్తుతం జియో ఫైబర్ సేవలు దేశంలోని 1600 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించేందుకు జియో సన్నాహాలు చేస్తోంది.
399 రూపాయల ప్లాన్ తో పాటు 699, 999 ప్లాన్ ను కూడా జియో ప్రారంభించింది. 999 ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్ వస్తుంది. అంతే కాకుండా.. ఈ ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, సోని లివ్ వంటి 12 ఓటీటీలు ఉచితంగా అందిస్తారు.