JD Lakshminarayana :2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, ఆ తర్వాత పెద్దగా రాజకీయ తెరపై కనిపించలేదు. జనసేనకు గతంలోనే రాజీనామా చేసిన లక్ష్మినారాయణకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలున్నా, ప్రత్యక్ష రాజకీయాల విషయమై ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
కాగా, బీజేపీ నుంచి 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, తిరిగి జనసేనలోకి వెళ్ళేందుకు లక్ష్మినారాయణ ప్రయత్నిస్తున్నారని కూడా అంటున్నారు. ఇవేవీ కాదు, లక్ష్మినారాయణ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారమూ లేకపోలేదు.
ఇదిలా వుంటే, తాజాగా లక్ష్మినారాయణ, అమరావతి రైతులకు మద్దతుగా మహా పాదయాత్రలో పాల్గొన్నారు. ‘ఏకైక రాజధాని అమరావతి’ అనే నినాదంతో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ వరకు మహా పాదయాత్ర చేపట్టారు అమరావతి పరిరక్షణ సమితి రైతులు. ఆ యాత్రకు మద్దతు ప్రకటించిన లక్ష్మినారాయణ, రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని వుండాలని స్పష్టం చేశారు.
ఒకే ఒక్క రాజధాని వుంటే, పెట్టబడులు వస్తాయనీ, రాజధానిని అభివృద్ధి చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం వుంటుందనీ, రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి తప్ప, పార్టీలకో వ్యక్తులకో కాదని లక్ష్మినారాయణ అన్నారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నదే నిజమైతే, పదమూడు రాజధానులతో పదమూడు జిల్లాల్ని అభివృద్ధి చేయొచ్చుగా.. అన్నది లక్ష్మినారాయణ ప్రశ్న.
లక్ష్మినారాయణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన వెనుక టీడీపీ వుందనీ, టీడీపీలో చేరే దిశగా లక్ష్మినారాయణ ప్రయత్నిస్తున్నారనీ, అందుకే వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారనీ వైసీపీ మద్దతుదారులు అంటున్నారు.