వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు. అది ఆయనకు కంచు కోట. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కుప్పం వదిలేలా లేరు. ఆ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుని ఓడిస్తామని వైసీపీ అంటోందిగానీ, అది సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. చాలా ఏళ్ళుగా కుప్పం నుంచే చంద్రబాబు పోటీ చేస్తున్నారు.. అది ఆయనకు కంచుకోట. దాన్ని బద్దలుగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.
ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గమేది.? 2019 ఎన్నికల్లో పోటీ చేసినట్టు తిరిగి గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేస్తారా.? లేదంటే, వీటిల్లో ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమవుతారా.? ఈ రెండిటినీ కాదని, వేరే నియోజకవర్గాల వైపు చూస్తారా.? ఈ విషయమై జనసేన పార్టీలో ఎవరికీ స్పష్టత లేదు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గం, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేయొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో, పాలకొల్లుపైనా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ఖరారు చేసుకోలేదని స్పష్టతనిచ్చేశారు.
ఇలా ఎలా ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడగలుగుతాడు.? పైగా, ఓ పార్టీ అధినేత ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమే. అయితే, ఆయన లెక్కలు ఆయనకున్నాయంటూ జనసేన పార్టీ షరామామూలు కథే చెబుతోంది. అయినాగానీ, పార్టీ నేతలకైనా పవన్ కళ్యాణ్ ఓ స్పష్టతనిస్తే, ఆయన ఆ నియోజకవర్గంలో తిరగకపోయినా, పార్టీ శ్రేణులు గట్టిగా పని చేయడం ప్రారంభిస్తాయి.
నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని కాదు, మొత్తంగా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని పని చేస్తామన్నది జనసేనాని వాదన. కానీ, ఇది రాజకీయాల్లో వర్కువటయ్యే వ్యూహమేనా జనసేన పార్టీకి.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.