Janasenani : జనసైనికుల్ని మళ్ళీ అయోమయంలోకి నెట్టేసిన జనసేనాని.!

Janasenani

Janasenani : 2024 ఎన్నికల్లో అధికార పీఠమెక్కుతాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.. అంటూ అమరావతి గడ్డపైనుంచి గట్టిగానే సంకేతాలు పంపేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఇంతకీ, జనసేన పార్టీ శ్రేణులకు ఏం అర్థమయ్యింది జనసేనాని ప్రసంగం ద్వారా.!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి ముందడుగు వేస్తారా.? తెలుగుదేశం పార్టీని కలుకుపోతారా.? వైసీపీ ప్రభుత్వాన్ని దించేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నది జనసేన అధినేత చెప్పిన మాట. మరి, అలా జగన్ సర్కారుని దించెయ్యాలంటే ఏం చేయాలి.? తాను ముఖ్యమంత్రి పీఠమెక్కాలంటే ఎలాంటి రాజకీయ వ్యూహాలు వుండాలి.?

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలతో చర్చలుంటాయి.. వర్క్ షాప్స్ నిర్వహణ జరగాలి.. జనసైనికులకు శిక్షణా తరగతులుండాలి.. ఇవేవీ జరగకుండానే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేశారు.

వాట్ నెక్స్‌ట్.! ఇంకేముంటుంది.. ఎంచక్కా జనసేనాని అమరావతి నుంచి హైద్రాబాద్ వచ్చేశారు. తన సినిమాల పనుల్లో బిజీ అయిపోనున్నారు. మళ్ళీ అమరావతిలో పార్టీ శ్రేణులకు జనసేనాని మొహం చూపించేదెప్పుడు.? జనం ముదుకు వెళ్ళేదెప్పుడు.?

ఈ ప్రశ్నలకు జనసైనికుల దగ్గరే సమాధానాల్లేవ్.! అదీ అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికులకు జనసేన ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఇచ్చిన స్పష్టత.