Nagababu With Pawan Kalyan : జనసేనానికి పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి మద్దతు వుందా.? లేదా.?

Nagababu With Pawan Kalyan
Nagababu With Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా చిరంజీవి మద్దతు వుంటుందా.? వుండదా.? ఈ విషయమై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే వుంది. రాజకీయాలకు తాను దూరంగా వున్నాననీ, అన్ని పార్టీలకు చెందిన నాయకులతోనూ సత్సంబంధాలు వున్నాయి తప్ప, ఏ పార్టీతోనూ రాజకీయ వైరం లేదని పలు సందర్భాల్లో చిరంజీవి చెబుతూ వస్తున్నారు.
చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి తెచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నా, ‘అందరివాడు’ అన్న గుర్తింపుని ఇంకోసారి పోగొట్టుకునేందుకు చిరంజీవి సిద్ధంగా లేరు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక తాను ఎదుర్కొన్న రాజకీయ విమర్శల్ని చిరంజీవి అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారు.
అయితే, రాజకీయాలకు దూరంగా వుంటున్నా, పలు అంశాల్లో ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా కనిపించేలా కొన్ని జనరల్ స్టేట్మెంట్లు చిరంజీవి విడుదల చేస్తున్నారు. అక్కడే జనసేన పార్టీ కొంత అయోమయంలో పడుతోంది. అన్నయ్య చిరంజీవి మద్దతు తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా వుంటుందని నమ్ముతోన్న జనసైనికులకు ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది.
తాజాగా, మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట పూర్తిస్థాయిలో నడుస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో, చిరంజీవి ఎప్పుడు పవన్‌తో కలుస్తారు.? అన్న చర్చ మొదలైంది. సరైన సమయంలో చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగుతారన్న అభిప్రాయమైతే సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి, చిరంజీవి ఏమంటారో.!