అడుగుకో గుంత.. గజానికో గొయ్యి: పవన్ కళ్యాణ్

నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ రహదార్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంటే, వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవడంలేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ పాలనలో అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. అన్నట్టు రోడ్ల పరిస్థితి తయారైందంటూ జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో చాలా రోడ్ల పరిస్థితి ఇలానే తయారైంది. కొన్ని కీలకమైన రహదార్లలో రెండేళ్ళుగా మరమ్మత్తులు లేక ఆ మార్గాల్లో వెళ్ళే వాహనాలు ధ్వంసమవుతున్నాయి.. ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది.. శారీరక వైకల్యాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వమెందుకు పట్టించుకోవడంలేదు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు.

రోడ్ల మరమ్మత్తుల కోసం వందల కోట్లు కేటాయిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం తరచూ చెబుతోంది. కానీ, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిథులు.. మంత్రులు సైతం సొంత గ్రామాలకు వెళ్ళేందుకు పాడైపోయిన రోడ్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతిసారీ వర్షాల సాకు చూసి, రోడ్లను బాగు చేసే పనిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలున్నాయి. మరోపక్క, ప్రభుత్వం రోడ్ల నిర్వహణ విషయంలో చిత్తశుద్ధితో వున్నా, సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదన్న వాదనలూ లేకపోలేదు. ఇంకోపక్క, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో ఎదురవుతున్న సమస్యల కారణంగానే మరమ్మత్తులు జరగడంలేదన్నది మరో వాదన. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కాదుగానీ, రోడ్లు సరిగ్గా లేకపోతే.. వివిధ రంగాలు పడకేస్తాయి. పర్యాటక రంగం దెబ్బ తింటుంది. పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతుంది. ప్రభుత్వం ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి వుంది.