Janasenani : జనసేనాని వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ.! నష్టమెంత.?

Janasenani : మూడు నెలలకో, ఆర్నెళ్ళకో రాజకీయ తెరపై కన్పించే పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదంది వైసీపీ. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయ నాయకుడిగానే చూడటం లేదంటూ వైసీపీ నాయకులు చాలామంది చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవం ఏంటంటే జనసేనాని పన్నిన వ్యూహంలో వైసీపీ చిక్కుకుంది.. అడ్డంగా బుక్కయిపోయింది. తెలుగుదేశం పార్టీ కూడా అయోమయంలో పడిపోయింది.

సరే, పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి ఎన్నాళ్ళు రాజకీయాల్లో సీరియస్‌గా వుంటారన్నది వేరే చర్చ. ప్రజలు ఆయన్ని ఎలా చూస్తారన్నది మరో చర్చ. వైసీపీ, టీడీపీ.. ఈ రెండూ జనసేన పార్టీ ఉచ్చులో పడ్డాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అయితే జనసేన వ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

అసలు విషయం ఏంటంటే, వైసీపీలో చాలామంది నాయకులు, జనసేనాని వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్నారు. ‘షణ్ముఖ వ్యూహం అంటున్నారేంటి.? వైసీపీ పాలన వైఫల్యాల్ని గట్టిగా ఎండగట్టే సరైన వ్యూహం పవన్ కళ్యాణ్ వద్ద నిజంగానే వుందా.? అధికారంలోకి ఖచ్చితంగా వస్తానంటూ పవన్ అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు.? ఆంధ్రప్రదేశ్ బాధ్యత తాను తీసుకుంటానని పవన్ చెప్పడంలో ఆంతర్యమేంటి.?’ వంటి ప్రశ్నలు వైసీపీలోనూ, టీడీపీలోనూ చర్చనీయాంశమవుతున్నాయి.

వైసీపీని అధికారంలోకి రానిచ్చేది లేదంటూ 2019 ఎన్నికల్లో జనసేనాని చెప్పిన మాట వాస్తవం. అది జరగలేదు. సో, పవన్ తాజా వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. దాంతో, జనసేనలోకి టీడీపీ నుంచి అలాగే వైసీపీ నుంచి నేతలు దూకే అవకాశం లేకపోలేదు. వైసీపీ ఈ విషయమై అప్రమత్తంగా వుండాల్సిందే.