పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఏదో మాయ ఉంది. ఆ పేరు చెబితే చాలు.. నేటి యువతలో పూనకం వస్తుంది. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జతకలిసి ఎన్నికల ప్రచారం చేస్తారని కూడా అనుకోలేదు. కానీ.. 2014 లో ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారం అటు టీడీపీకి ఇటు బీజేపీకి బాగా కలిసివచ్చాయి.
అలా రాజకీయాల్లో తన మొదటి అడుగుపెట్టి.. సొంతంగా పార్టీని కూడా ఏర్పాటు చేశారు పవన్. జనసేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసి 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశారు. కానీ.. 2019 ఎన్నికల్లో కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయారు. 2019 కాకపోతే 2024 ఉంది కదా.. అన్న సానుకూల దృక్పథంతో పవన్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.
అయితే.. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామో? గెలవమో? అన్న అనుమానంతో పవన్ కళ్యాణ్ ముందుగానే బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు తప్పించి ఇంకేమీ లేదు. పేరుకే పొత్తు.. కానీ.. ఎవరి పని వారిది. రెండు బద్ధ శత్రువు పార్టీలు అన్నట్టుగా ఏపీలో వ్యవహరిస్తున్నాయి.
ఏ పార్టీ విధానాలను ఆ పార్టీ నెరవేర్చుకుంటూ వెళ్లిపోవడం.. ఏ పార్టీ మీటింగులు ఆ పార్టీ నిర్వహించుకోవడం.. చూస్తుంటే.. అసలు.. ఈ రెండు పార్టీలు ఎందుకు పొత్తు కూడినట్టు అనే అనుమానం వస్తుంది.
ఇదే అనుమానం జనసేన అధినేత పవన్ కు కూడా వచ్చినట్టుంది. అంతే కాదు.. గత కొన్ని రోజుల నుంచి బీజేపీ తమను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడంపై పవన్ కాస్త గుర్రుగానే ఉన్నారట. బీజేపీ పెద్దలతో మాట్లాడుదామన్నా.. పవన్ కు అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదట. దీంతో బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్.. బీజేపీకి కొన్ని కండీషన్లు పెట్టారట.
ఇక నుంచి ఏ మీటింగ్ జరిగినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. తమను సంప్రదించాలని.. రెండు పార్టీలు కలిసే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని పవన్ తేల్చి చెప్పారట. ఒకవేళ అలా జరగకపోతే.. ఎవరి దారి వారు చూసుకోవాల్సిందే.. అన్నంత కోపంలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఈ రెండు పార్టీలు ఎన్నిరోజులు కలిసి జగన్ పై పోరాడుతాయో?