రాజకీయం అనే మహా సముద్రంలో ఇప్పటి వరకు ఏ తీరం చేరకుండా ఇంకా ఈదుతున్న పార్టీ ఏదంటే జనసేన అని చెబుతారు.. ఆ పార్టీ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులను అయితే సంపాదించుకున్నారు గానీ రాజకీయంగా గట్టి పునాది మాత్రం వేసుకోలేదని అంటున్నారట విశ్లేషకులు.. ఇక ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ ఆవేశంగా దూసుకెళ్లుతున్న జనసేనకు ఆది నుండి అనుకోని విధంగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి..
ఇకపోతే ఏపీలో ఎప్పటి నుండో రగులుకుంటున్న వివాదం.. అమరావతి విషయం.. ఏపీ సీయం వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో ఆసక్తి చూపిస్తుండగా, మూడు రాజధానులు వద్దే వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సూటిగా జనసేన స్పష్టం చేస్తూ, నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియ చేసిందన్న విషయం తెలిసిందే.. ఇదే కాకుండా జనసేన పార్టీ మొదటి నుంచి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉంది. వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో మూడు రాజధానులు పెడతానని చెప్పలేదు కాబట్టి.. నమ్మక ద్రోహం చేసినట్లేనని పవన్ కల్యాణ్ విమర్శలు కూడా చేశారు..
అయితే జనసేన వాదన ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ నేతలకు మంటపుట్టిస్తుందట.. ఇలా ఎందుకంటే టీడీపీతో పొత్తు కుండ పగిలిన తర్వాత జనసేన, బీజేపీతో రాజకీయ బంధం ఏర్పరచుకుంది.. ఈ క్రమంలో మా పొత్తు ఎప్పటికీ పదిలం అంటూ.. అటు పవన్, ఇటు బీజేపీ రాష్ట్ర చీఫ్.. సోము వీర్రాజులు సంయుక్తంగా ప్రకటించారు కూడా. కానీ, క్షేత్రస్థాయిలో ఈ పొత్తును ప్రామాణికంగా తీసుకుని ఇరు పార్టీలు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక ఏపీ రాజధాని విషయంలో బీజేపీ ఒక దారిలో వెళ్లుతుండగా,. పవన్ స్టాండ్ వేరేగా ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఇరు పార్టీల నాయకులు కలిసే ఉన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా రాజధాని విషయంలో హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసిన జనసేన తీరు బీజేపీకి ఇబ్బందికర పరిణామంగా మారిందట.. కనీసం అఫిడవిట్ దాఖలు పై తమతో మాట మాత్రంగా అయినా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు అనుకుంటున్నారట.. అంతేకాకుండా ఇలా అయితే.. పవన్‌తో కష్టమే.. ముందు ముందు ఇంకెలా ప్రవర్తిస్తారో, దీనికంటే జనసేనతో తెగతెంపులు చేసుకోవడమే నయం అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట.. కాగా ఈ పరిణామాలు ఇరు పార్టీల మధ్య అంతరాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు పరిశీలకులు..