రాపాక వరప్రసాద్.. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంద అంటారా? అవును.. విన్నారు. ఆయన ఎవరో కాదు.. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్కడు ఎంత ధీమాతో ఉండాలి కానీ.. రాపాకలో ప్రస్తుతం అది కరువైంది. దానికి కారణం కూడా ఆయనే. తన గోతి తానే తీసుకున్నాడు రాపాక. జనసేన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక.. గెలవగాన తన సొంత పార్టీ జనసేనకే నిప్పు పెట్టడం స్టార్ట్ చేశాడు.
తన పార్టీని వదిలేసి.. తన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాటలను వినకుండా.. తనకు నచ్చినట్టు చేసుకుంటూ పోయాడు. అధికార పార్టీ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తూ పోయాడు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. తనను ఎలాగైనా ఆదుకుంటుంది.. అని అనుకున్నాడో ఏమో.. కానీ.. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది రాపాక పరిస్థితి.
జనసేన నేతలు కానీ.. జనసేన ముఖ్యులు కానీ.. ప్రస్తుతం రాపాకను పట్టించుకోవడం లేదు. అది ఆయన చేసుకున్నదే. వైసీపీలోనూ రెండు వర్గాలు ఉండగా… అందులో బొంతు రాజేశ్వరరావు వర్గం రాపాకను పట్టించుకోలేదు కానీ.. అమ్మాజీ వర్గం మాత్రం రాపాకకు అండగా నిలబడింది. దీంతో రాపాక మరింత రెచ్చిపోయాడు. తన సొంత పార్టీని అస్సలు పట్టించుకోలేదు. జనసేనపై విమర్శలు చేసి.. జగన్ కు జై కొట్టాడు.
అంత వరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు రాపాకకు, అమ్మాజీ వర్గానికి చెడింది. అమ్మాజీ వర్గం రాపాకకు మద్దతు ఇవ్వడం లేదు. వాళ్లు దూరం పెట్టేయడంతో రాపాక పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అమ్మాజీ వర్గానికి, రాపాకకు చెడటంతో.. బొంతు వర్గం రెచ్చిపోయి.. రాపాక మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారట.
అటు వైసీపీలోని రెండు వర్గాలు పట్టించుకోకపోవడం, తన సొంత పార్టీ నేతలు కూడా తనను దూరం పెట్టడంతో.. తన నియోజకవర్గంలో రాపాక ఒక్కడే అయ్యాడట. ఒంటరి అయ్యాడట. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికారుల వద్దకు వెళ్లినా.. రాపాకను పట్టించుకునే నాథుడే లేడట. దీంతో తాను ఒంటరినయ్యానని రాపాకకు అర్థం అయిందట. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నాడట రాపాక.