పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రాజకీయపరమైన నిర్ణయాలు జనసేన పార్టీని ఒక్కోసారి కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. అందుకు నిదర్శనమే ప్రస్తుతం జనసేన పార్టీ పరిస్థితి. 2019 ఎన్నికల్లో పరాజయం పొందాక జనసేన ఊహించని రీతిలో చాలా త్వరగానే కోలుకుంది. కొత్త ప్రభుత్వానికి కొంచెం టైమ్ ఇద్దాం.. అప్పుడు తప్పులేవైనా ఉంటే వేలెత్తి చూపిద్దాం అంటూ పవన్ ఇచ్చిన పిలుపు జనానికి సైతం నచ్చింది. మెల్లగా పవన్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, సమస్యల మీద నిలదీయడం మొదలుపెట్టాక పార్టీ శ్రేణులకు ఉత్సాహం వచ్చింది. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడ ఏ పార్టీ కార్యకర్తలూ చేయని రీతిలో సేవా కార్యక్రమాలు చేసి శభాష్ అనిపించుకున్నారు జనసైనికులు. ప్రజల్లో సైతం పార్టీ పట్ల నమ్మకం మొదలైంది.
ఇలా పార్టీ మెల్లగా గాడిలో పడుతోంది అనుకునే సమయానికి బీజేపీ రూపంలో ముసలం మొదలైంది. ఏ ముహూర్తాన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో కానీ ఆ పొత్తు పార్టీ పీకల మీదకి వచ్చి కూర్చుంది. ఏ పార్టీ అధ్యక్షుడైనా వేరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముందుగా తమకు కలిగే ప్రయోజనాలు ఏమిటో చూసుకుంటారు. పవన్ బీజేపీ దోస్తీతో ఏం ఒరుగుతుందనుకున్నారో కానీ రాత్రికి రాత్రి చేతులు కలిపేశారు. ఇకపై ఒంటరి పయనమే అంటూ శపథాలు చేసిన నాయకుడు ఇలా పొత్తులకు తెరతీయడం జనసైనికులకు కూడ నచ్చలేదు. ప్రజాదరణలో జనసేన కంటే బీజేపీది తక్కువ స్థానమే. కాబట్టి బీజేపీ అవసరం జనసేన కంటే జనసేన అవసరమే బీజేపీకి ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీతో తమ పార్టీకి ఒరిగేదేమిటో ఇప్పటికీ చాలామంది కార్యకర్తలకు బోధపడలేదు.
ఇలా పార్టీ శ్రేణులు అయోమయంలో ఉండగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. బీజేపీ మెల్లగా జనసేనను డామినేట్ చేసుకుని వెళ్లిపోతోంది. అధ్యక్షుడు సోము వీర్రాజు ఊహించని రీతిలో దూకుడు కనబరుస్తున్నారు. దేవాలయాల మీద దాడులను హిందూ మతం మీద దాడులుగా అభివర్ణిస్తూ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించిన స్థాయిలో పవన్ విమర్శించలేకున్నారు. ఏదైనా ఇష్యూ మీద తప్పో ఒప్పో ఒక ఖచ్చితమైన స్టాండ్ ఉండాలి. బీజేపీ దేవాలయాల విషయంలో క్రిస్టియానిటీని పెంచి పోషిస్తున్నారు. హిందూత్వాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ జగన్ మీద ఎగిరెగిరి పడుతున్నారు. కానీ పవన్ టార్గెట్ లేకుండానే గురిపెడుతున్నారు. అందుకే వీర్రాజు మాటలకున్న మైలేజ్ పవన్ ప్రసంగానికి లేకుండా పోయింది.
మెజారిటీ జనం జనసేనను పక్కనపెట్టి బీజేపీ గురించి, సోము వీర్రాజు గురించే మాట్లాడుకుంటున్నారు. బీజేపీ దాదాపుగా జనసేనను వెనక్కి నెట్టేసింది. ఈ పరిస్థితే ఇంకొన్నాళ్లు సాగితే జనసేనకున్న ఆ కాస్త గుర్తింపు కూడ పోయి బీజేపీకి బీ టీమ్ అనే ముద్రపడిపోతుంది. ఆతర్వాత పార్టీ ఇండివిడ్యువాలిటీ పూర్తిగా భూస్థాపితమై పార్టీ కనుమరుగైపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.