‘నా సేన కోసం నా వంతు’.! జనసేనకి లాభమా.? నష్టమా.?

రాజకీయ పార్టీలు విరాళాల సేకరిస్తాయ్. ఆ విరాళాలు సేకరించకపోతే, రాజకీయ పార్టీలు నడవవా.? అంటే, విరాళాల వెనుక పెద్ద రాజకీయమే కలిపిస్తుంటుంది. దాన్ని విరాళం అనకూడదు, లంచంగా అభివర్ణించాలంటారు కొందరు ప్రజాస్వామ్యవాదులు.

ఒకప్పటి రాజకీయ విరాళాలు వేరు, ఇప్పటి రాజకీయ విరాళాలు వవేరు. అధికారంలో వున్న పార్టీలకు ఎక్కువగా విరాళాలు వస్తుంటాయ్. ఎందుకూ.? అంటే, తద్వారా తమకు ఇంకో రకంగా లాభం జరుగుతుందని విరాళాలు ఇచ్చేవారు భావిస్తుంటారు గనుక.

విపక్షాలకూ విరాళాలు ఇస్తుంటారు కొందరు. తద్వారా, ఆయా పార్టీలు అధికారంలోకి వస్తే, తమకు మేలు జరుగుతుందనే ఆలోచన వారికి వుంటుంది. వామపక్షాలకూ విరాళాలు అందుతాయ్.. వారు తమ జోలికి రాకుండా ఆ విరాళాలు ఇస్తుంటారు బడా పారిశ్రామిక వేత్తలనేది ఓ ఆసక్తికరమైన వాదన.

మరి, జనసేనకు సంబంధించి ‘నా సేన కోసం నా వంతు’ అనే కార్యక్రమాన్ని ఎలా అభివర్ణించాలి.? నో డౌట్, జనసేన పార్టీకి స్వచ్ఛందంగానే విరాళాలు వస్తాయ్. పవన్ కళ్యాణ్ సినిమా కోసం చేసే ఖర్చు, సంవత్సరానికి రెండు సార్లైనా జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చేద్దాం.. అని పవన్ అభిమానులు అనుకోవడంలో వింతేమీ లేదు.

జనసేన పార్టీకి స్వచ్ఛందంగా ఏదైనా చేయగలుగుతారు అభిమానులు. జనసేన పార్టీ నడుస్తున్నదీ ఆ అభిమానుల కారణంగానే. పవన్ కళ్యాణ్ ఎటూ సినిమాల్లో సంపాదించింది పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి. ఎలా చూసినా, ‘నా సేన కోసం నా వంతు’ అనే ట్యాగ్, జనసేన పార్టీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్.. అన్నది నిర్వివాదాంశం.